posted on Apr 13, 2024 11:18AM
కేసీఆర్ హయాంలో తెలంగాణలో విపక్ష నేతలు, సొంత పార్టీ నేతలు, సినిమా తారల ఫోన్లు ట్యాపింగ్ కు గురైయ్యాయన్న ఆరోపణల రచ్చ పలువురు పోలీసు అధికారుల అరెస్టు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన అధికారులనే ఫోన్ ట్యాపింగ్ చేసే పని కోసం ఎంపిక చేసుకున్న తీరు కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బీఆర్ఎస్ అగ్రనేతలు సహా పలువురికి నోటీసులు పంపే అవకాశాలున్నట్లు పోలీసువర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రాధాకిషన్‌రావు సహా.. డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, కానిస్టేబుల్ అరెస్టయ్యారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో కూడా కలకలం సృష్టిస్తోంది.
తమ ఫోన్లను ఇన్చార్జి డీజీపీ, ఏడీజీతోపాటు అడిషనల్ ఎస్పీలు ట్యాపింగ్ చేస్తున్నారని, ఈ వ్యవహారంలో ఇటీవల బదిలీ అయిన ఐజీ కొల్లి రఘురామిరెడ్డి కూడా ఉన్నారంటూ ఎన్డీఏ కూటమి ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ ఆ ఫిర్యాదుపై ఇంకా దృష్టిసారించిందో లేదో కానీ తాజాగా లోకేష్ కు యాపిల్ సంస్థ స్వయంగా మీ ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ లకు గురౌతోందంటూ వచ్చిన సందేశం ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ధృవీకరించేసింది. డీజీపీ, ఇంటలిజన్స్ చీఫ్, ఈ ట్యాపింగ్‌కు సహకరిస్తున్న అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలను తప్పించాలని ఈసీపై తెలుగుదేశం కూటమి ఒత్తిడి తీసుకువస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ముఖేష్‌కుమార్ మీనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న భావనలో ఉన్న తెలుగుదేశం కూటమి.. ఎంపి కనకమేడల ద్వారా ఢిల్లీ లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తాము వివిధ జిల్లాల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఐ, డీఎస్పీ, జాయింట్ కలెక్టర్లపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, మీనా స్పందించడం లేదని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అన్నిటికంటే, అందరి కంటే ముఖ్యంగా బీజేపీ కూడా మీనా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.
ఈ నేపథ్యంలోనే యాపిల్ సంస్థ నుంచి లోకేష్ పోన్ కు వచ్చిన ట్యాపింగ్, హ్యాకింగ్ సందేశం తెలుగు దేశం కూటమికిబలమైన అస్త్రంగా మారింది. ఇప్పుడు కనకమేడల ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా రంగంలోకి దిగే అవకాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల ఐఏఎస్-ఐపిఎస్‌లపై తీసుకున్న చర్యలు కూడా నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతోనే జరిగాయని కూటమి నేతలు చెబుతున్నారు. కూటమి నేతల ఆరోపనలు, ఫిర్యాదులను బట్టి తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఏవిధంగా ఫోన్ ట్యాపింగ్ కోసం వెలమ సామాజికవర్గ అధికారులను ఉపయోగించుకుందో.. సరిగ్గా అలాగే ఏపీలో సీఎం జగన్ సర్కార్ కూడా రెడ్డి సామాజికవర్గ అధికారులను ఫోన్ ట్యాపింగ్‌కు వాడుతోందని అర్ధమౌతుంది.
సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి, ఏడీజీ సీతారామాంజనేయులు, డీఎస్పీలయిన నరేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రవీంద్రారెడ్డి సహకారంతోనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఎన్డీఏ కూటమి ఈసీకి ఫిర్యాదు చేసింది. వీరిలో సీతారామాంజనేయులు మినహా మిగిలినవారంతా రెడ్డి వర్గానికి చెందిన వారే కావడం ఇందుకు నిదర్శనం. నిజానికి తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని మొట్టమొదట బయటపెట్టింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కావడం విశేషం. మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగితే తెలంగాణలోలాగే.. ఏపీలో కూడా కీలక అధికారులకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.