posted on Apr 12, 2024 5:44PM
గత ఎన్నికల ప్రచార సందర్భంగా, అలాగే ఈ ఐదేళ్ళ పదవీ కాలంలో ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాటలు కోటలు దాటిపోయాయి. ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జగన్ ప్రతిపక్షంలో వుండగా ముస్లింలకు తమ ఉత్తుత్తి హామీలతో 70 ఎం.ఎం. సినిమా చూపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ముస్లిం యువతుల వివాహానికి ‘షాదీ తోఫా’ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు. అయితే, అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రికి ఆ పథకం గుర్తొచ్చింది. ఇంకా ఈ పథకం అమలు విషయంలో కూడా అంతా అయోమయమే. మనవాళ్ళు.. పరాయివాళ్ళు అనే భేదం షరా మామూలే. ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు చెప్పిన మాటలు,
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నీ గాల్లో కలిసిపోయాయి. పాత హామీలు నెరవేర్చలేదు… కొత్తగా ఏ పథకమూ ప్రవేశపెట్టలేదు.ముస్లింల విషయంలో జగన్ చెప్పిన ఒక పెద్ద అబద్ధం ‘రంజాన్ తోఫా’. తెలుగుదేశం ప్రభుత్వం ఏటా నాలుగు లక్షల మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించేది. జగన్ వచ్చాక తోఫా ఇవ్వకుండా ధోకా ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో ముస్లిం, మైనారిటీ విద్యార్థులకు ఏటా ఐదు వేల వరకు స్కాలర్‌షిప్ అందేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ షిప్పు మునిగిపోయింది.
ఉర్దూకు ద్వితీయ భాష హోదా ఇస్తానని జగన్ చేసిన బాస నీటిమీద రాత అయిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం ఉర్దూ పాఠశాలలను అభివృద్ధి చేసింది లేదు. ఉర్దూ టీచర్ల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసిందీ లేదు. టీడీపీ ప్రభుత్వం ఉర్దూ అకాడమీ ద్వారా ప్రతి ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులకు 5 వేల నుంచి 10 వేల వరకు ప్రోత్సాహక నగదు ఇచ్చేది. మన జగనన్న వచ్చాక ఆ ప్రోత్సాహక పథకం నిరుత్సాహంలో పడిపోయింది. ఇక వక్ఫ్ భూములను వైసీపీ నాయకులు గుటకాయస్వాహా చేయడం అనే సంగతి సరేసరి. ఇలా ఏరకంగా చూసి జగన్ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు తీరని అన్యాయమే జరిగింది. అందుకే ఈసారి వైసీపీని మటాష్ చేయడానికి, జగన్ అండ్ కంపెనీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి ముస్లింలు రెడీగా వున్నారు.