Home తెలంగాణ బీజేపీ ఎన్నికల అస్త్రంగా కచ్చాతీవు!? | katchateevu as bjp election weapon| modi| political|...

బీజేపీ ఎన్నికల అస్త్రంగా కచ్చాతీవు!? | katchateevu as bjp election weapon| modi| political| gain| dispute

0

posted on Apr 12, 2024 12:28PM

మరో సారి ప్రాంతీయ మంటలను రేపి ఎన్నికల లబ్ధి పొందేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారా? వివాదాస్పద అంశాలను రాజకీయం చేసి తమిళనాట ఎన్నికలలో ప్రయోజనం చేకూర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు.

 కచ్చాతీవు ద్వీపాన్ని 1974లో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంక దేశానికి అప్పగించిందని, ఆ ద్వీపాన్ని తిరిగి భారత్ లో కలిపేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది.  గత పదేళ్లుగా అధికారంలోనే ఉన్న ప్రధాని మోడీ ఎప్పుడూ కచ్చతీవు అంశంపై నోరెత్తింది లేదు. సరిగ్గా 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట, అది తమిళనాడులో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న వేళ ఈ ప్రకటన చేయడం వెనుక ఉన్న ఎత్తుగడ ఎన్నికల లబ్ధి పొందేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గతంలో కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తామని  ఆయన ప్రకటించారు.  దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ బంగ్లాదేశ్ కు 10వేల ఎకరాలు ధారాదత్తం చేసారని ప్రతి విమర్శ చేసారు.

దేశ ప్రయోజనాల నిమిత్తం పొరుగు దేశాల తో జరిగిన ఒప్పందాలను బీజేపీ వివాదం చేస్తున్నదని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. 1921 నుంచి కచ్చతీవు ద్వీపం శ్రీలంక (బ్రిటిష్ సిలోన్) ఆధీనంలో ఉంది. 1974వరకు భారత్ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని గుర్తించే వరకు ఇరుదేశాల మధ్యా ఇది వివాదంగానే ఉంది.  ఈ ద్వీపం వైశాల్యం   285ఎకరాలు. జాఫ్నా ద్వీపకల్పంలో నెడుంతీవు, రామేశ్వరం మధ్య కచ్చాతీవు ఉంది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఇండో శ్రీలంక సముద్ర ఒప్పందంలో భాగంగా ఈ దీవిని  శ్రీలంకకు చెందినదిగా అంగీకరించారు. చరిత్ర తిరగేస్తే 1187-96మధ్య పాలించిన శ్రీలంక రాజు నిస్సంక మల్లా రామేశ్వరం శాసనంలో ఈ కచ్చి దీవు ప్రస్తావన ఉంది. ఈ ద్వీపం పోర్చుగీసు,డచ్, బ్రిటీష్ వారి హయాంలో శ్రీలంక పరిధిలోనే ఉంది.

మధ్యయుగంలో జాఫ్నా రాజ్యంలో ఉంది. 17వ శతాబ్దం నుంచి రామ నాడ్ రాజ్యం లో (మధురై జిల్లా) ఉండేది. ఆ తర్వాత భారత ఉపఖండం తోపాటు బ్రిటీష్ వారి అధీనంలోకి వచ్చింది. మద్రాస్ ప్రెసిడెన్సీ లో భాగమైంది. ఈ ద్వీపంలో కాథలిక్ మందిరం ఉంది. ఇరు దేశాల భక్తులు ఈ మందిరాన్ని సందర్శిస్తారు. ఈ ద్వీపంపై భారత ప్రభుత్వం శ్రీలంక సార్వభౌమత్వం అంగీకారంపై  తమిళనాడు మత్స్యకారుల లో ఉన్న అసంతృప్తి ని దృష్టిలో ఉంచుకునే ప్రధాని నరేంద్రమోడీ  ఎన్నికల అస్త్రంగా కచ్చాదీవు వ్యవహారాన్ని కెలికి వివాదం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  దీనిపై ఇరు దేశాలు మళ్లీ చర్చలు పునఃప్రారంభించాలన్న  భారత్ డిమాండ్ ను శ్రీలంక తోసిపుచ్చింది. ఇది ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం కనుక  దీనిపై చర్చలు ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేసింది.   ఎన్నికల ప్రయోజనాల కోసం  ప్రభుత్వాలు దేశ ప్రయోజనాల దృష్ట్యా చేసుకున్న ఒప్పందాలను ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించకపోవడం సముచితం కాదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడు తున్నారు.  

Exit mobile version