కాంగ్రెస్ సర్కార్ నేతన్నల ఉసురు తీస్తుంది…
మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు బిజెపి ఎంపీ బండి సంజయ్. బతుకమ్మ చీరల బకాయిలు రూ.270 కోట్లు చెల్లించకపోవడంతోపాటు కొత్త ఆర్డర్లు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో వస్త్రపరిశ్రమలు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు భిక్షాటన కూడా చేసినా స్పందించడం లేదని..ఇది మంచి పద్దతి కాదన్నారు . తక్షణమే చనిపోయిన లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని నష్టపరిహారం అందించి నేతన్నల్లో భరోసా నింపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే రూ.270 కోట్ల బకాయిలను చెల్లించి కొత్త ఆర్డర్లు ఇచ్చి వస్త్ర పరిశ్రమ యధావిధిగా కొనసాగేలా చూడాలన్నారు. 50 శాతం విద్యుత్ సబ్సిడీని పునరుద్దరించి, యార్న్ సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని, అంతిమంగా నేతన్నలకు భరోసా ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దీనిపై గతంలో సీఎంకు లేఖ రాశానని అయినా స్పందన లేకపోవడంతో నేతన్నలకు అండగా, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ఈనెల 10న ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సిరిసిల్లలో ‘దీక్ష’ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీక్షకు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని కోరారు.