Thursday, January 16, 2025

ఈ సారి సర్వేపల్లి సోమిరెడ్డిదేనా? | positive winds to somireddy in sarvepally| kakani| corruption| jagan| sarkar| anti| incumbency| pro| tdp

posted on Apr 6, 2024 2:37PM

సర్వేపల్లి నియోజకవర్గం.. ఈ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రంగంలో ఉన్నారు. అయితే సోమిరెడ్డికి సర్వేపల్లి పెద్దగా కలిసి వచ్చే నియోజకవర్గం కాదన్న అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉండేది. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు పరాజయం పాలయ్యారు. అయినా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఆయనకు మరో సారి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం సోమిరెడ్డిని గెలుపు పట్టించేలా ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అయితే సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ బలమైన నాయకుడే. అయితే ఐదేళ్ల జగన్ పాలనా వైఫల్యాలకు తోడు స్వయంగా కాకాణిపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ప్రజలలో ఆయన ప్రతిష్ఠను పలుచన చేశాయంటున్నారు. 

నిజానికి నెల్లూరు జిల్లా అంటే పార్టీ ఆవిర్భావం నుంచీ కూడా వైసీపీకి కంచుకోటలా ఉంది. 2014 ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీదే ఆధిపత్యం.ఆ ఎన్నికలలో జిల్లాలో తెలుగుదేశం మూడు నియోజకవర్గాలలో విజయం సాధించింది. వైసీపీ ఏడు నియోజకవర్గాలలో విజయభేరి మోగించింది. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే ఆ ఎన్నికలలో వైసీపీ నెల్లూరు జిల్లాను స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం పది నియోజకవర్గాలలోనూ వైసీపీయే గెలిచింది. ఆ ఎన్నికలలో జిల్లాలో తెలుగుదేశం ఖాతాయే తెరవలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మాత్రం వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా మారిపోయాయి.  ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు   కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామ్‌నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు దాదాపు ఏడాది కిందటే వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరారు. తాజాగా   వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సైతం తెలుగుదేశం కండువా కప్పుకుని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈ చేరికలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవ్వడమే కాకుండా పార్టీ బలోపేతం అవ్వడానికి దోహదపడ్డాయి.

తెలుగుదేశం జిల్లాలో ఎంతగా పుంజుకున్నా సర్వేపల్లి నియోజకవర్గం మాత్రం వైసీపీకి పెట్టని కోటే అన్న భావన ఇటీవలి కాలం వరకూ ఉండేది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత   పరిస్థితిలో ఒక్క సారిగా మార్పు వచ్చింది. నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు,  కార్యకర్తలు పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రచారానికి జనం నుంచి భారీ స్పందన వస్తోంది. నియోజకవర్గంలో  పొదలకూరు మండలం కాకాణి గోవర్ధన్ రెడ్డికి కంచుకోట అనడంలో సందేహం లేదు. ఆ మండలంలోనే సోమిరెడ్డికి అపూర్వ ఆదరణ లభిస్తుండటంతో ఈ సారి సోమిరెడ్డి చంద్రమేహన్ రెడ్డి విజయం నల్లేరు మీద బండినడకే అనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్కసారిగా సర్వేపల్లిలో వైసీపీకి ఎదురుగాలి వీచడానికి  కాకాణిపై   ఉన్న అవినీతి ఆరోపణలే కారణమంటున్నారు.

కృష్ణపట్నం పోర్టు నుంచి బయటకు వచ్చే లారీలు, వాహనాల నుంచి కాకాణి  పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారన్న  ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన వసూళ్ల దెబ్బకు తట్టుకోలేక   పోర్టు ద్వారా కంటైనర్ల  రాకపోకలు నిలిచిపోయాయని నియోజకవర్గంలో  గట్టిగా వినిపిస్తోంది.  ఆ కారణంగా కనీసం 10,000 మంది ఉద్యోగాలు కోల్పోయారనీ, అంతే కాకుండా రొయ్యల గుమతులకు సైతం ఇబ్బందులు ఎదురౌతున్నాయనీ అంటున్నారు. ఈ కారణంగా కాకాణిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెబుతున్నారు. ఆ వ్యతిరేకతకు తోడు మూడు సార్లు నియోజకవర్గం నుంచి మూడు సార్లు పరాజయం పాలైన సోమిరెడ్డిపై సానుభూతి కూడా ఉందనీ చెబుతున్నారు. ఆ సానుభూతికి నియోజకవర్గంలో కాకాణిపై వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీకి సానుకూలత తోడై సొమిరెడ్డి విజయానికి దోహదపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అంతా బాగున్నప్పటికీ విజయం కోసం సోమిరెడ్డి చెమటోడ్చక తప్పదని అంటున్నారు.  

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana