posted on Apr 5, 2024 10:00AM
వైసీపీ బరితెగించేసింది. నియమ నిబంధనలను గాలికొదిలేసి.. ప్రజలను ప్రలోభాలకు గురి చేసైనా సరే ఎన్నికలలో విజయం సాధించాలని చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వైసీపీ ముఖ్య నేతల నివాసాలూ గోడౌన్లలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కానుకల పందేరానికి అవసరమైన సామగ్రిని డంప్ చేసి పెట్టుకున్నారు.
పలు చోట్ల అటువంటి డంప్ లను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. మొన్న చెవిరెడ్డి గోడౌన్లలో, నిన్న కొడాలి నాని ముఖ్య అనుచరుడి నివాసంలో.. గుడివాడలో కొడాలి నాని ముఖ్య అనుచరుడి నివాసంలో పెద్ద ఎత్తున చీరల బండిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉ:చిన చీరల బండిల్స్‌ను పోలీసులు గురువారం (ఏప్రిల్ 4)న గుర్తించి సీజ్ చేశారు. పోలీసులకు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీకాంత్ సుమారు రూ.30 లక్షల విలువ చేసే చీరలుగా ఉన్నట్లు గుర్తించారు.
డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు ఎస్‌ఐ, సీఐలకు అందిన సమాచారంతోనే ఈ దాడి జరిగిందని చెబుతున్నారు. మొత్తం 46 బండిల్స్ సీజ్ చేసిన పోలీసులు ఇవి విజయవాడకు బుకింగ్ ద్వారా వచ్చిన ట్లు గుర్తించారు. 175 నియోజకవర్గాలలో చీరలు పంపిణీ జరిగేందుకు వాటిని ఇక్కడ డంప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మొత్తం మీద నిన్న మొన్నటి వరకూ వైసీపీ అడుగులకు మడుగులొత్తిన పోలీసలు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో స్వేచ్ఛగా పని చేస్తున్నారని భావించాల్సి వస్తుంది. పోలీసులంటే తాము ఆడించినట్లల్లా ఆడతారని ఇంత కాలం భావించిన వైసీపీ నేతలకు ఇప్పుడీ పరిణామాలు మింగుడుపడటం లేదు.