posted on Apr 5, 2024 4:25PM
మద్యం కుంభకోణం కేసులో కవితకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పడు తాజాగా సీబీఐ రంగంలోకి దిగింది.
ఈ కేసులో కవితను విచారించేందుకు రెడీ అయ్యింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
రిమాండ్లో భాగంగా ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. అయితే, ఆమె మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉంది. ఆమెకు మధ్యంతర బెయిలు ఇవ్వవద్దుంటూ ఈడీ గట్టిగా వాదించింది. కవితకు బెయిలు ఇస్తే ఆధారాలు ధ్వంసం చేసే అవకాశాలున్నాయనీ, అలాగే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈడీ కోర్టుకు తెలిపింది.
అదలా ఉంటే ఇప్పుడు ఇదే కేసులో కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించడంతో కవిత మరిన్ని చిక్కుల్లో ఇరుక్కున్నట్లేనని పరిశీలకులు అంటున్నారు. కవితను విచారించడానికి అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్ పై కోర్టు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.