posted on Apr 5, 2024 1:11PM
కిల్లి కృపారాణి.. ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళం జిల్లా కు చెందిన సీనియర్ పొలిటీషియన్.. శ్రీకాకుళం ఎంపిగా అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న అప్పటి తెలుగుదేశం నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రంనాయుడుపై కాంగ్రెస్ నుండి పోటీ చేసి భారి మెజారిటి తో ఓడించి అప్పట్లో పెను సంచలనమే సృష్టించారు కృపారాణి.. అదిమొదలు.. ఆమె రాజకీయ ప్రస్థానం అప్రతిహాతంగా దూసుకుపోయింది. కృపారాణి క్యాపబిలిటి గుర్తించిన సోనియా గాంధీకి కృపారాణి మరింత దగ్గరయ్యారు.. అందుకే కేంద్ర సహాయ మంత్రి పదవి సైతం కృపారాణి కి చేరువ చేశారు. అయితే రాష్ట్ర విభజన అంశంలో పాపాన్ని మూటగట్టుకుని ఒక్కసారి పతన దశకు చేరుకున్న ఎపి కాంగ్రెస్ లో అందరు నేతలు బయటకు వెళ్ళినా కృపారాణి చాలా కాలం ఆ పార్టీ లో ఉన్నారు. ఓ వైపు కృపారాణి కాంగ్రెస్ లో కొనసాగినా.. అప్పట్లో వై.ఎస్.జగన్మోహనరెడ్డి వైసిపి స్థాపించిన తొలినాళ్ళలో చేపట్టిన ఓదార్పు యాత్ర శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సైతం కృపారాణి భర్త రామ్మోహన్ అన్నీ తానై చూసుకున్నారు. అలా వైకాపా కు ముందు నుండి దన్నుగా నిలిచిన కుటుంబంగా కిల్లి ఫ్యామిలి పేరు సంపాదించుకుంది. కానీ వైసిపి లో చేరడానికి మాత్రం కృపారాణి చాలా కాలం టైం తీసుకుంది. జగన్ నుండి పిలుపు వస్తుందని 2014 నుండి 2019 వరకూ ఎదురుచూసిన కృపారాణి ఎంతకూ అటువైపుగా ఎలాంటి కబురు లేకపోవడంతో అనూహ్య పరిణామాల మధ్య 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు వైసిపి కండువా కప్పుకున్నారు.
జగన్ ఓదార్పు యాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టి అధిష్టాన నిర్ణయం కాదని వైసిపి సంస్థాగత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న తమకు పార్టీలో రెడ్ కార్పెట్ ఉంటుందని భావించి జాయిన్ అయిన కృపారాణికి.. ఇన్నేళ్ళు అయినా.. సాధారణ కార్యకర్త లానే ట్రీట్ చేసింది తప్ప చెప్పుకోతగ్గ పోస్టింగ్ ఒక్కటి కూడా వైసిపి ఇవ్వలేదు.. మధ్యలో జిల్లా పార్టీ అధ్యక్షురాలి పదవి ఇచ్చినా.. అది కేవలం కొన్ని నెలలు మాత్రమే పరిమితం చేసి.. తరువాత ఆమెకు తెలియకుండానే ధర్మాన కృష్ణదాస్ కు ఆ పదవిని బదిలీ చేసేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా భాధ్యతలు నిర్వర్తించిన సమయంలో సైతం కృపారాణి మాటకు పార్టీలో విలువ అంతంతమాత్రమే అని చెప్పాలి..
జిల్లా అధ్యక్షురాలి పదవిని వేరొకరికి ఇచ్చేసిన తరువాత.. పార్టీ నామినేటెడ్ పదవుల్లోనూ, నూతన రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల ప్రస్తావన వచ్చినప్పుడు రాష్ట్రంలోని మీడియా అంతా కూడా ముందు కృపారాణి పేరే ఉంటుందని వార్తల కనిపించేవి.. అయితే అప్పుడు కూడా చివరికి కృపారాణి కి మొండి చెయ్యే మిగిలేది.
అప్పట్లో జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డిని కలిసే వి.ఐ.పి లిస్టు లో కూడా కృపారాణి పేరు లేకపోవడం, జగన్ కలిసేందుకు వచ్చిన సమయంలో కృపారాణి ని జిల్లా పోలీసులు అడ్డుకోవడం, అవమాన భారంతో ఏడుస్తూనే ఆమె అక్కడి నుండి వెనుతిరగడం పెద్ద సంచలనంగా మారింది.
జరగాల్సిన అవమానాలు అన్నీ జరిగిపోయాయి.. సార్వత్రిక ఎన్నికలకు సమయం అసన్నమైన సమయంలో.. ఇక అన్నీ సర్దుకుంటాయని కృపారాణి భావించారు. తనకు పార్టీ అందిస్తుంది అనుకున్న పదవులు అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి.. ఇక మిగిలించి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానమే కదా.. ఆల్రేడి శ్రీకాకుళం పార్లమెంట్ బరిలో పలుమార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన అనుభవం ఉన్న తనకే ఈ టికెట్ అని గంపెడాశలు పెట్టుకున్న కృపారాణికి చివరికి అదికూడా దక్కలేదు. శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్ధిగా పేరాడ తిలక్ పేరు ప్రకటించినప్పటికీ కృపారాణి గడచిన కొద్ది రోజులుగా సైలెంట్ గానే ఉన్నారు.
జిల్లా లో నేతలు అందరూ ఎవరికీ వారు ఎన్నికల పనుల్లో నిమఘ్నమయిపోతు.. కనీసం తన సపోర్ట్ కూడా ఎవరూ అడగకపోవడం కృపారాణిని, ఆమె క్యాడర్ ను మరింత నీరు గార్చింది. జగన్ మోహన రెడ్డి తన తమ్ముడు.. ఇది తన తమ్ముడి పార్టీ అని ఎప్పుడూ చెప్పుకునే కృపారాణి.. పార్టీ లో జరుగుతున్న వరుస అవమానాలు, అన్యాయాలు చూసి సహించలేకపోయారు.. ఇన్ని జరుగుతున్నా జగన్మోహన రెడ్డి నుండి కాని, అధిష్టానం లోని పెద్దల నుండి కానీ కనీస ఓదార్పు, భరోసా లేకపోవడంతో తన విధేయతకు ఉన్న వీరతాడును తీసేశారు.. రాజీనామా చేసేశారు…
రాజీనామా ప్రకటిస్తూ కృపా రాణి ప్రెస్ మీట్ లో కన్నీరు కార్చడం.. ఆమెకు జరిగిన అవమానాలు అన్నీ మీడియా ముందు ఏకరువు పెట్టడం.. ఇప్పుడు ఇవే రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటాను అని చెప్పిన కృపారాణి తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కడప జిల్లాలో ప్రచారంలో భాగంగా కిళ్ళి కృపారాణికి కండువా కప్పి షర్మిల కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల వద్దకు చేరుకున్న కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందదర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ కోసం ఎంతో కష్టపడ్డానని, ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టానని చెప్పారు. అలాంటి తనను జగన్ పక్కన పెట్టారన్న కృపారాణి కష్టపడ్డా తనకు గుర్తింపు లేదని చెప్పారు. తమకు వైఎస్సార్ దేవుడు అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ది అని అన్నారు. వైఎస్సార్ ను వైఎస్ షర్మిల లో చూస్తున్నామని అన్నారు. షర్మిలమ్మ న్యాయకత్వం లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తుందన్నారు. జగన్ ఒక నియంత అని, ఈ నియంత ను గద్దె దించాలని, షర్మిలమ్మ కి కడప ఎంపీగా ఇక్కడ ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.
ఈసారి అసెంబ్లీ కి పోటీ చేస్తానని గతంలో తెలుగు వన్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో స్పష్టం చేసిన కృపారాణి.. టెక్కలి అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. టెక్కలి లో అభ్యర్ధి ప్రకటించకపోవడం వెనుక మతలబు ఇదే అయ్యే అవకాశం ఉంది. టెక్కలిలో కృపారాణి అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తే కనుక.. అది వైసిపి కి పెద్ద ఎఫెక్ట్ లానే కనిపిస్తోంది. ఇన్నాళ్ళు వైసిపి తరపున తన కోటరీని పెంచుకున్న కృపారాణి.. తన వర్గం ఓట్లను ఇప్పుడు కాంగ్రెస్ కు బదిలీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. టెక్కలి లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలుపును అడ్డుకోవడానికి అనేక వ్యూహాలు రచిస్తున్న వైకాపా అధిష్టానానికి ఇప్పుడు కృపారాణి రూపంలో స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చింది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న ఈ తరుణంలో ఈ స్పీడ్ బ్రేకర్ ను దాటి మళ్ళీ వేగం పుంజుకోవాలి అంటే వైసిపి చాలానే కష్టపడాలి..