ఉగాది పచ్చడి విశిష్టత
షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారు. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతుంటారు. ఈ రోజున వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్రదర్శనము, ఆర్య పూజనము, గోపూజ, ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.