posted on Apr 3, 2024 3:44PM
ప్రముఖ సినీ నటి, మాండ్యా ఎంపీ సుమలత (60) బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటకలో ఈసారి ఏప్రిల్ 26, మే 7న రెండు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనుండగా, సుమలత కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరి, ఎన్డీయే అభ్యర్థి హెచ్ డీ కుమారస్వామికి మద్దతు ఇస్తానని నేడు ఓ ప్రకటనలో తెలిపారు.
జేడీ(ఎస్) నేత కుమారస్వామి రానున్న లోక్ సభ ఎన్నికల్లో మాండ్యా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రెండ్రోజుల కిందట ఆయన సుమలత నివాసానికి వెళ్లి మద్దతు కోరారు. సిస్టర్… నాకు మీ సహకారం కావాలి అని అర్థించారు. ఈ నేపథ్యంలో, నేడు సుమలత చేసిన ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా ప్రకటన చూస్తుంటే, మాండ్యా స్థానం నుంచి ఈసారి ఆమె పోటీ చేయడంలేదన్న విషయం స్పష్టమవుతోంది. గతంలో ఆమె తన భర్త అంబరీష్ మరణానంతరం మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సుమలత… కుమారస్వామి తనయుడు నిఖిల్ పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ నుంచి సహకారం లభించింది. అందుకు ఇప్పుడామె బీజేపీకి కృతజ్ఞత తెలుపుకుంటూ, పోటీ నుంచి విరమించుకున్నారు.
అయితే, తాను మాండ్యా నుంచి ఎక్కడికీ వెళ్లబోనని, రానున్న రోజుల్లోనూ తాను నియోజకవర్గం కోసం పనిచేస్తానని సుమలత స్పష్టం చేశారు. ఇవాళ ఆమె తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు.