posted on Apr 3, 2024 2:33PM
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే13న జరిగే పోలింగ్‌లో జగన్ కు ఆయన పార్టీకీ ఓటుతో గుణపాఠం చెప్పేందుకు రెడీ అయిపోయారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేత పెల్లుబుకుతుండటంతో మరోసారి అధికారంలోకి రావడం కష్టమని సర్వేల ద్వారా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి.. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎలాగోలా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ వైసీపీ నేతలు రాష్ట్రంలోని కొందరు అధికారుల సహకారంతో రెచ్చిపోతున్నారు. మ రోవైపు వాలంటీర్లు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నా, రాజకీయ పార్టీల సమావేశాలకు హాజరైనా, ఎన్నికల విధుల్లో నిమగ్నమైనా చర్యలు తీసుకోవాలని ఈసీ ఉత్తర్వులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిసైతం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. అయినా, కొందరు వాలంటీర్లు బహిరంగంగానే వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా ఇంటింటికి తిరిగి వైసీపీకి ఓట్లు వేయాలని కోరుతున్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఈసీకి పలు సార్లు ఫిర్యాదులు చేశారు.
ఏపీలోజగన్ హయాంలో ఐదేళ్లపాటు అరాచక పాలన సాగిందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టడం, జైలుపాలు చేయడంతోపాటు.. దాడులుసైతం చోటుచేసుకున్నాయి. మేము ఏం చేసినా మాకు ఎవరూ ఎదురు మాట్లాడొద్దు.. మాట్లాడితే దాడులు తప్పవు అన్నట్లుగా వైసీపీ నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేశారు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనా అక్రమ కేసులు పెట్టింది జగన్ ప్రభుత్వం. పోలీసులు, అధికారులను అడ్డంపెట్టుకొని ఐదేళ్లు రాష్ట్రంలో సీఎం జగన్ అరాచక పాలన సాగించాడు. జగన్ ఫ్యాక్షన్ పాలనకు చెక్ పెట్టాలంటే కేంద్రంలో బీజేపీ అండదండలు ఉండాలని భావించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో బీజేపీకి ప్రజాబలం లేకపోయినా వారు కోరిన సీట్లు ఇచ్చిన తమ కూటమిలో చేర్చుకున్నాయి. తెలుగుదేశం, జనసేన కూటమిలో బీజేపీ కలవడం, గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించడంతో జగన్ మోహన్ రెడ్డి ఆటలకు చెక్ పడుతుందని అందరూ భావించారు. కానీ, కేంద్రంలోని బీజేపీ పెద్దలు జగన్, వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలకు చెక్ పెట్టడంలో తాత్సారం చేస్తూ వచ్చారు. దీనికి తోడు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధిష్టానం జగన్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుందన్న చర్చ కూడా రాజకీయాలలో జరిగింది. జగన్ ప్రమేయం వల్లనే బీజేపీ నుంచి టికెట్ ఆశించిన రాఘురామ రాజుకు చుక్కెదురైందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. స్వయంగా రఘురామ రాజు సైతం తనకు బీజేపీ టికెట్ రాకపోవటానికి కారణం జగన్ మోహన్ రెడ్డేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలోతెలుగుదేశం, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ.. బీజేపీ పెద్దలు మాత్రమే జగన్ మోహన్ రెడ్డికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న వాదన ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతున్నది. దీంతో తెలుగుదేశం, జనసేన శ్రేణులు బీజేపీ కేంద్ర పెద్దలపై ఆగ్రహంతో ఉన్నారు. పొత్తు ధర్మాన్ని బీజేపీ తుంగలో తొక్కుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా బీజేపీ కేంద్ర పెద్దల్లో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో గత నాలుగు రోజులుగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి వరుసగా షాక్‌లు తగులుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాలంటీర్లు ఎన్నికల్లో పాలు పంచుకోవద్దని ఇప్పటికే ఈసీ ఆదేశించింది. దీనికితోడు పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్ల ప్రమేయం ఉండొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలున్న వాలంటీర్లు పెన్షన్ల పేరుతో, రేషన్ పేరుతో ఓటర్ల వద్దకు వెళ్తుండడంతో ఇక నుంచి అలాంటివి కుదరవని ఈసీ తెల్చి చెప్పింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ.. వైసీపీ పార్టీ అభ్యర్థులకు వత్తాసు పలుకుతున్న అధికారులపైనా ఈసీ గురిపెట్టింది. పలువురు కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల విధులకు దూరం చేసింది. దీంతో జగన్, ఆయన వర్గీయులు ఆందోళనకు గురవుతున్నారు. వారి ఆందోళల ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీనికితోడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు జడ్ సెక్యూరిటీని కేంద్రం కల్పించింది. వైసీపీ ప్రభుత్వంలో నారా లోకేశ్ పై అనేకసార్లు వైసీపీ నేతలు దాడులకు యత్నించారు. ఆ సమయంలో భద్రత కల్పించాలని కోరినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికల మేరకు లోకేశ్ కు కేంద్ర జడ్ కేటగిరి భద్రతను కేంద్రం కల్పించింది. లోకేశ్ కు జెడ్ సెక్యూరిటీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ నేతలు.. అవాకులు చవాకులు పేలుతున్నారు.
సుప్రీం కోర్టులోనూ జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఆదేశించింది. ఈసీ ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వైసీపీ నేతలపై కొరడా ఝళిపిస్తుండటంతో పాటు మరోపక్క జగన్ కేసుల విచారణ కూడా వేగం పుంజుకుంటుండటంతో బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారని, జగన్, ఆయన వర్గీయుల ఆగడాలకు చెక్ పడినట్లేనని ప్రతిపక్షాల నేతలు పేర్కొంటున్నారు. దీంతో జగన్ కు, ఆయన పార్టీ నేతలకూ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.