posted on Apr 3, 2024 10:51AM
గత ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి హత్య వ్యవహారం జగన్ మోహన్ రెడ్డి సీఎం పీఠాన్ని అదిరోహించడంలో కీలక భూమిక పోషించింది. ప్రస్తుత ఎన్నికల్లో అదే వివేకా హత్య ఘటన జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధంగా మారబోతుంది. ప్రతిపక్షాలకు తోడు.. చెల్లెళ్లు షర్మిల, సునీతారెడ్డిలు ప్రజా క్షేత్రంలో జగన్ అరాచకాలను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జగన్ పార్టీకి ఎవరూ ఓట్లు వేయొద్దని, హత్యా రాజకీయాలను ప్రోత్సహించొదంటూ సునితారెడ్డి బహిరంగంగానే ప్రజలను కోరారు. తాజాగా, ఆమె మరో అడుగు ముందుకేసి వివేకా హత్య ఘటనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, అవసరమైతే సాక్షి ఛానల్ లోనూ తాను చర్చకు వస్తానని, జగన్ మోహన్ రెడ్డి చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. సునీతా ఛాలెంజ్‌తో వైసీపీ శ్రేణులు వణికిపోతున్నాయి. ఇప్పటికే జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సునీతారెడ్డి సవాల్ లో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుగా అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రధాన ముద్దాయి అవినాశ్ రెడ్డి అంటూ షర్మిల, సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జగన్ అడ్డుకుంటున్నాడని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రిని హత్యచేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సునీతారెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో జగన్, ఆయన పార్టీ నేతలూ వివేకా హంతకులు సునీతారెడ్డి, ఆమె భర్త అని, వివేకా అక్రమ సంబంధమే ఇందుకు ప్రధాన కారణమంటూ ప్రచారం చేశారు. ప్రతీరోజూ సునీతారెడ్డిపై బురద జల్లటమే పనిగా వైసీపీ వ్యవహరించింది. ఇలాంటి పరిస్థితుల్లో సునీతారెడ్డి ఛాలెంజ్‌ను జగన్‌మోహన్ రెడ్డి స్వీకరించకుంటే ఇన్నాళ్లూ తాము సునీతారెడ్డి, షర్మిలపై చేసిన విమర్శలు తప్పుడు విమర్శలని ప్రజలు అర్థం చేసుకొనే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జగన్ స్థానంలో ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి రంగంలోకిదిగి సునీతారెడ్డితో చర్చకు సిద్ధమవ్వాలని, అలా చేయకుంటే మరికొద్దిరోజుల్లో జరిగే ఎన్నికల్లో జగన్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో పార్టీ బాధ్యతలను ఆయన చెల్లెలు షర్మిల భుజానికెత్తుకున్నారు. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి జగన్ జైలు నుంచి మళ్లీ తిరిగొచ్చే వరకు వైసీపీ బలోపేతానికి ఆమె కృషి చేశారు. అలాంటి చెల్లెలు సైతం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మారిపోయారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు విరుద్దంగా వైసీపీ పాలన ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. వివేకా హత్యకేసులో ముద్దాయి అవినాశ్ రెడ్డి అని స్పష్టమవుతున్నప్పటికీ.. జగన్ మళ్లీ కడప ఎంపీ సీటును అవినాశ్ రెడ్డికి ఇవ్వడంపై షర్మిల, సునీతారెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగానే ఎదుర్కొనేందుకు వారు సిద్ధమయ్యారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో అవినాశ్ రెడ్డిని ఓడించడం ద్వారా జగన్ మోహన్ రెడ్డికి షాకిచ్చేందుకు షర్మిల సిద్ధవ్వడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒకవైపు వివేకా హత్యకేసు, కడపలో వైఎస్ షర్మిల పోటీ, మరోవైపు జగన్ తో వివేకా హత్యపై చర్చకు తాను సిద్ధమంటూ సునీతారెడ్డి సవాల్ ఇలా అన్ని అంశాలు ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తుండగా.. వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి భయాన్ని పెంచుతున్నాయి.