posted on Apr 1, 2024 9:15AM
కింద పడ్డా పై చేయి మాదేనని వాదిస్తారు కొందరు. తమ తప్పిదాలన్నిటినీ ఇతరుల మీద నెట్టేసి పబ్బం గడిపేయాలని ప్రయత్నిస్తుంటారు ఇంకొందరు. ఇప్పుడు వైసీపీ సరిగ్గా అదే చేస్తోంది. అధికారంలో ఇన్న ఈ ఐదేళ్ల కాలంలో విపక్ష నేతల భద్రతను కుదించి, వారిపై దాడులకు దారులు తెరిచేసింది.
జడ్ ప్లస్ భద్రత ఉన్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే పలు మార్పు దాడులు జరిగాయి. ఆయన తరచుగా వెళ్లే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనే వైసీపీ దాడికి పాల్పడింది. కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించింది. అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా జరిగిన దాడియత్నాల గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి అనంతరం కేంద్ర హోం శాఖ, చంద్రబాబు భద్రత చూసే ఎస్పీజీ రాష్ట్రంలో పర్యటించి ఆయన భద్రతపై సమీక్ష జరిపి అదనపు భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పడు లోకేష్ కు కూడా జడ్ కేటగరి భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో విపక్ష నేతలకు భద్రత లేని పరిస్థితి ఉందని కేంద్ర హోం శాఖ భావిస్తున్నదంటే అర్ధం ఏమిటి? ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లే కదా? అయితే వైసీపీ మాత్రం అలా చెప్పదు. ఆ పార్టీ అధినేత నుంచి నేతల వరకూ అందరిదీ ఒకే బాణి తమ తప్పులన్నీ ఎదుటి వారికి ఆపాదించేసి తాము సుద్దపూసలమన్నట్లు చెబుతారు. వైఎస్ వివేకా హత్య నుంచి మొదలు పెడితే.. ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ తాను చేసిన అరాచకాలు, అఘాయిత్యాలూ, అక్రమాలు అన్నిటినీ తెలుగుదేశం పార్టీకి ఆపాదించి, తన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడమే. తాజాగా లోకేష్ కు జడ్ కేటగరి భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించడంపై కూడా ఘనత వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ అదే చేశారు.
వైసీపీకి ఉన్న జనాదరణ చూసి తెలుగుదేశం వణికిపోతోందన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రంలో మరో సారి జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమనీ, అది జరిగితే తమకు ముప్పు అన్న భయంతోనే కేంద్రంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు తనయుడికి జడ్ కేటగరి భద్రత కల్పించుకున్నారని బొత్స అంటున్నారు. అదే సమయంలో మంత్రిగా ఉన్న తనకే ఆ స్థాయి భద్రత లేదని చెప్పుకున్నారు. ఆయన మాటలను బట్టే రాష్ట్రంలో వైసీపీ వారి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదనీ, ఉన్న ముప్పల్లా విపక్ష నేతలకేననీ ఎవరికైనా సులువుగా అర్ధం అయిపోతుంది. కానీ వైసీపీకీ మాత్రం అన్నీ రివర్స్ లోనే అవగతమౌతాయి. బొత్స మాటల తీరు కూడా అలాగే ఉంది.