Sunday, January 19, 2025

కేసీఆర్ ది బస్సు యాత్రా.. బల ప్రదర్శనా.. రైతులతో అసహనం! | farmers not happy with kcr bus yatra| 100| cars| rally| arrogance| reach| distanat| show| of

posted on Apr 1, 2024 11:06AM

పదేళ్ల పాటు అధికారంలో ఉండి.. తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ ఓటమి తరువాత ఆయనకు ఏదీ కలిసిరావడం లేదు. జాతీయ రాజకీయా ఆకాంక్షలతో ఆకాశానికి నిచ్చెన వేసిన ఫలితం వ్రతమూ చెడింది. ఫలమూ దక్కలేదన్నట్లుగా తయారైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయంతో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది.

దీంతో జాతీయ రాజకీయాల ఊసెత్తడానికి కూడా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అసలు లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలలో నిలబెట్టేందుకు అభ్యర్థులే కరవైన పరిస్థితి. పిలిచి టికెట్టిచ్చినా పోటీ నుంచి నేతలు తప్పుకుంటున్న పరిస్థితి.  ఎలాగోలా తంటాలు పడి అభ్యర్థులను నిలబెట్టినా.. రాష్ట్రంలో ఒకటి రెండు లోక్ సభ స్థానాలలో విజయం సాధించడమే గగనమంటూ సర్వేలు చెబుతున్నాయి. ఈ స్థితిలో అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత ఇప్పటి వరకూ పెద్దగా ప్రజల ముందుకు రాని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరువు కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు అంటూ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించారు. అయితే  ఆయన బస్సు యాత్ర ఆద్యంతమ జనంతో సంబంధం లేకుండానే సాగింది. వంద కార్ల భారీ ర్యాలీతో సాగిన కేసీఆర్ బస్సు యాత్రను రైతులు పెద్దగా పట్టించుకోలేదు. ఎల్ నినో కారణంగా వర్షాలు పడక నీటి వనరులు తగ్గిపోయి, రిజర్వాయర్లు ఎండిపోయి సాగుకు నీరందకుండా పోయింది. వాస్తవమే.

అయితే  ఇంతటి కరవుకు కారణం రేవంత్ పాలనే అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను రైతులు పట్టించుకోలేదు. రేవంత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు. అయినా ప్రభుత్వ పని తీరును అంచనా వేయడానికి కొంత సమయం ఇవ్వాలి కదా? అన్న చర్చ రైతుల్లోనే జరుగుతోంది. అందుకే కేసీఆర్ రేవంత్ సర్కార్ పై సంధించిన విమర్శనాస్త్రాలను రైతులు పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రసంగాలకు, విమర్శలకు జనం నుంచి స్పందనే కనిపించలేదు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్న పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకుని రేవంత్ సర్కార్ ను ఎండగట్టాలన్న కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టినట్లుగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 


తన  పదేళ్ల పాలనలో నీటి కష్టాలు లేవని, రైతులు సంతోషంగా ఉన్నారనీ, అధికదిగుబడి సాధించారనీ, ఇప్పుడు  రైతులకు అన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ రైతులను రెచ్చగొట్టి తద్వారా  లోక్ సభ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించాలన్న కేసీఆర్ వ్యూహం ఫలించినట్లు కనిపించడం లేదు.  ఏసీ, ఫ్రిజ్, సౌకర్యవంతమైన పడకలు, సోఫాలు వంటి అన్ని హంగులూ ఉన్న బస్సులో కూర్చుని వందకు పైగా కార్లు వెనుక కాన్వాయ్ గా వస్తుండగా సాగిన కేసీఆర్ బస్సు యాత్ర ఆయన అహానికి అద్దం పట్టింది కానీ, రైతులను ఆకట్టుకోలేకపోయింది. 

అసలు కేసీఆర్ పాలనను జనం వ్యతిరేకించి గద్దె దింపడానికి ప్రధాన కారణాలలో ఒకటి అహంకారపూరితమైన ఆయన తీరు. అధికారంలో ఉండగా ఎన్నడూ ప్రజలతో మమేకం కావడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యంగా స్పందించారు. ప్రజాందోళనలను అణచివేశారు. ఈ కారణాలతోనే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు విపక్ష నేతగా కూడా ఆయన అధికారంలో ఉన్నప్పటి దర్పాన్ని ప్రదర్శించడం, కష్టాలలో ఉన్న రైతల పరామర్శకు కూడా మంది మార్బలంతో రావడంతో జనంలొ  కేసీఆర్ బల ప్రదర్శనకు వచ్చారు తప్ప, తమ కష్టాలను చూసి ఓదార్చి స్వాంతన చేకూర్చేందుకు కాదన్న అభిప్రాయం కలిగేలా చేసింది.   

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana