- సర్కారుపై ‘విరమణ’ భారం!
- వచ్చే మూడేళ్లలో పెద్ద సంఖ్యలో రిటైర్ కానున్న ప్రభుత్వ ఉద్యోగులు
- వారికి తక్షణ బెనిఫిట్ల చెల్లింపు కోసం ఏటా రూ.3,500 కోట్ల వరకు అవసరం
- ఈ భారం భరించలేమనే గతంలో రిటైర్మెంట్ వయసు మూడేళ్లు పెంపు
- దానితో పదవీ విరమణలకు మూడేళ్లు గ్యాప్.. ఈ ఏడాది నుంచి మళ్లీ మొదలు
- ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్‌లకు చెల్లింపులు కూడా కష్టమే!
- ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్.. ఎంపీ ఎన్నికలయ్యే సరికి ఐదో డీఏ గడువు
- నిధుల సర్దుబాటు ఎలాగన్న దానిపై ఆర్థిక శాఖ తర్జనభర్జన
- ఈ ఏడాది డిసెంబర్ వరకు రిటైర్ కానున్న 7,995 మంది ప్రభుత్వ ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లతో ఆర్థిక శాఖలో ఆందోళన మొదలైంది. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఇవ్వాల్సిన తక్షణ బెనిఫిట్లను చెల్లించేందుకు ఏటా రూ.3,500 వేలకోట్ల భారం పడనుంది ఈ మేరకు నిధులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. 2021లో అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (క్లాస్–4 ఉద్యోగులు మినహా) రిటైర్మెంట్లు జరగలేదు.తిరిగి ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7,995 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్టు సమాచారం. వీరికి ప్రభుత్వం చెల్లించాల్సిన తక్షణ బెనిఫిట్ల కింద రూ.3,200 కోట్ల వరకు అవసరమని ఆర్థిక శాఖ అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా కష్టమవుతుండటం, ఇక నుంచి ఏటా రిటైర్మెంట్ల భారం మరింత పెరగనుండటం ఆర్థిక శాఖను కలవరపెడుతోంది.
సరాసరి రూ.40 వేల మూల వేతనం
ఈ ఏడాది రిటైర్మెంట్లను పరిశీలిస్తే 1,419 మంది గెజిటెడ్ స్థాయి, 5,360 మంది నాన్ గెజిటెడ్ స్థాయి, 1,216 మంది క్లాస్–4 ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. నాన్ గెజిటెడ్ వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. రిటైరయ్యే వారి సగటు మూల వేతనం రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. దీనికి హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, డీఏలు కలిపితే ఈ మొత్తం రూ.60 వేల వరకు ఉంటుంది. రిటైరయ్యే ప్రతి ఉద్యోగికి లీవ్ శాలరీల కింద 10 నెలల వేతనాన్ని.. అంటే రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమిటేషన్ కింద రూ.20 లక్షలు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలి.అంటే సగటున ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి రూ.38లక్షల నుంచి రూ.40 లక్షల వరకు తక్షణ బెనిఫిట్లను వారి హక్కుగా ఇవ్వాలి. ఈ ఏడాది రిటైరయ్యే 7,995 మందికి ఈ బెనిఫిట్లను చెల్లించాలంటే రూ.3 వేల కోట్లకుపైగా అవసరం. ఇక 2025లో 9,630 మంది, 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారని లెక్కలు చెప్తున్నాయి. అంటే వారికి తక్షణ బెనిఫిట్ల కింద సగటున ఏటా రూ.3,500 కోట్ల వరకు చెల్లించాలి. దీనితో ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితేమిటి?
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్‌లకు కూడా చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. వీటికితోడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరిలో చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఐదో డీఏ (జూలై, 2024) కూడా ముందుకు వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో.. ఈ నాలుగు డీఏల చెల్లింపును సర్కారు వాయిదా వేస్తూ వస్తోంది.గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా (జీఎల్‌ఐ) కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చిందని ఆర్థికశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు రిటైరైన ఉద్యోగులకు వారి జీఎల్‌ఐతోపాటు జీపీఎఫ్‌పై వడ్డీ చెల్లించాలని.. ఇవన్నీ కలిపితే చాలా భారం పడుతుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచి అప్పటికి ఈ భారం నుంచి గట్టెక్కిందని.. ఇప్పుడు చెల్లించక తప్పదని తెలిపారు. ఈ చెల్లింపుల కోసం నెలకు రూ.250 కోట్లదాకా అవసరమన్నారు.
ఎప్పటికప్పుడే బెనిఫిట్లుచెల్లించాలి: ఉద్యోగ సంఘాలు
రిటైర్మెంట్లతో సర్కారుపై భారమన్న ప్రచారంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఉద్యోగి రిటైరవడానికి మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారని, ఉద్యోగుల హక్కు కింద ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. పదవీ విరమణ వయసును మరోసారి పెంచడం వంటి ఆలోచనలు చేయవద్దని కోరుతున్నాయి.