posted on Apr 1, 2024 8:15AM
ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పించన్లు ఇకపై వాలంటీర్ల ద్వారా కాకుండా, ఉద్యోగులే పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో వైసీపీకి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే వారు నానా యాగీ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకూ వాలంటీర్లే పించనర్లకు డబ్బులు నేరుగా ఇచ్చేవారు. ఎన్నికల కోడ్ లేదు కాబట్టి అది సాగింది. కానీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత నిబంధనల ప్రకారమే జరగాలి. అలా జరిగేలా చూసే బాధ్యత ఎన్నికల సంఘానిది. రాష్ట్రంలో కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో కేందా్ర ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి ముగ్గురు పరిశీలకులను కూడా రాష్ట్రానికి పంపింది. సరే అదలా ఉంచితే.. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఈ విషయాన్ని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దీనికి తోడు వాలంటీర్లంతా వైసీపీ వాళ్లేనని పలు సందర్బాలలో మంత్రులే చెప్పారి. వారి సేవలను ఎన్నికలలో వాడుకుంటామని ప్రకటనలు కూడా చేశారు. అంతెందుకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాలలో చెప్పారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న ఎన్నికల సంఘం వలంటీర్లనూ ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశించింది. అంతే కాకుండా వారి ఫోన్ల నుంచి సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకోమని చెప్పింది. వాలంటీర్ల స్థానంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పించన్లు పంపిణీ చేయాలని విస్పష్టంగా ఆదేశించింది. ఇప్పుడు ఆ పని ప్రభుత్వోద్యోగులకు అప్పగించమని నిర్దేశించింది. దీనిపై వైసీపీ ఇంతగా గగ్గోలు పెట్టడం ఎందుకో అర్ధం కావడం లేదు. సామాజిక పింఛన్లు అందకుండా తెలుగుదేశం కుట్రలు చేస్తోందన్న వైసీపీ విమర్శలు చూస్తుంటే.. పించన్లు పంపిణీ చేయకుండా, అందుకు కారణం తెలుగుదేశం అని ప్రచారం చేయడానికి వైసీపీ రెడీ అయిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వోద్యోగుల ద్వారా పించన్ల పంపిణీ సక్రమంగా సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సీఎస్ జవహర్ రెడ్డిదే. ఇప్పుడు ఆయన ఆపద్ధమర్మ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలకు తలొగ్గాల్సిన అవసరం లేదు.
ఎలాగూ పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బు ఖజానాలో రెడీగా ఉంటే పంపిణీకి అడ్డేముంటుంది. అయితే వైసీపీ యాగీ వెనుక, గగ్గోలు వెనుక పింఛన్ల సొమ్ము ఖజానాలో లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఆ సొమ్ములను వైసీపీ అనుకూల కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల పంపిణీకి వాడేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు వల్లే వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయని.. అధికార పార్టీ చేస్తున్న విమర్శలు ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి. సీఈసీ పెన్షనర్లకు డబ్బులు ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇవ్వాలని ఆదేశించిందే తప్ప, అసలు పెన్షన్లు ఇవ్వవద్దని అనలేదు. ఎన్నికల కోడ్ కాబట్టి వాలంటీర్ల బదులు, ప్రభుత్వ సిబ్బందితో పెన్షన్ డబ్బులు అందచేయాలని చెప్పిందే తప్ప, సంక్షేమపథకాలు ఆపమనలేదు. కానీ వైసీపీ మాత్రం ఎన్నికల సంఘం పింఛన్లు నిలిపివేయాలనీ, సంక్షేమ పథకాలు ఆపేయాలని ఆదేశించిందన్నట్లుగా మాట్లాడటం విస్తుగొలుపుతోంది. వైసీపీ బాధంతా ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పెన్షన్లు ఇస్తున్నందుకా? లేక వాలంటీర్ల ద్వారా ఇవ్వనందుకా? ఎవరిస్తే ఏమిటి? సొమ్ము లబ్థిదారులకు అందడమేగా కావాల్సింది? ఇప్పుడు వైసీపీ ఆరోపణలు, విమర్శలు చూస్తుంటే.. వాలంటీర్లద్వారా పింఛన్ల పంపిణీ జరిగితే.. ఆ డబ్బులు ఇస్తున్నది జగనే అని వారు ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వోద్యోగులైతే.. ఆ సొమ్ము పంపిణీకి జగన్ కు ఎటువంటి సంబంధం లేదని అందరికీ అర్ధమైపోతుంది. ఇదీ వైసీపీ బాధ.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలూ సంక్షేమ పథకాలను అమలు చేశాయి. అయితే జగన్ సర్కార్ వచ్చే వరకూ సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ సిబ్బంది ద్వారానే అమలయ్యాయి. వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత మాత్రమే వాలంటీర్ల చేతికి సొమ్ములిచ్చి పంపిణీ చేసింది. ఇప్పుడు అది కూడదనే సరికి.. పెన్షనర్లకు సొమ్ములెలా అందుతాయంటూ గగ్గోలు పెట్టేస్తోంది. ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ కోడ్ ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించడం సహజం. గత ఎన్నికల సమయంలో విపక్షంలో ఉన్న వైసీపీ ఫిర్యాదులపైనే పై అప్పటి డీజీపీ, సీఎస్, ఏడీజీని ఈసీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. ఎల్వీని ఈసీనే నేరుగా సీఎస్‌గా నియమించింది. అప్పుడు ఒప్పైన ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు వైసీపీకి ఎందుకు తప్పు అవుతోందన్నది ఆ పార్టీయే చెప్పాలి.