posted on Apr 1, 2024 8:39AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గత పదేళ్లుగా బెయిలు మీదే ఉన్నారనీ, ఆయన బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం గత జనవరిలోనే తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో రఘురామకృష్ణం రాజుపై అనర్హత పిటిషన్ వేసినందునే ఆయన జగన్ బెయిలు రద్దు చేయాలన్న పటిషన్ వేశారంటూ ముకుల్ రోహత్గి చేసిన వాదనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ కేసు విషయంలో తాము రాజకీయాల జోలికి పోవడం లేదనీ, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఆ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యంపై సీబీఐని నిలదీసింది. విచారణ జాప్యానికి బాధ్యులెవరని ప్రశ్నించింది. దీనికి సీబీఐ తరఫు న్యాయవాది విచారణలో జాప్యం, వాయిదాలతో తమకు సంబంధం లేదని చెప్పారు.
దాంతో సీరియస్ అయిన సుప్రీం అయితే ఎవరికి సంబంధం ఉంటుందని సూటిగా ప్రశ్నించింది. ఆ సమయంలో జోక్యం చేసుకున్న రఘురామకృష్ణం రాజు తరఫు న్యాయవాది సీబీఐ, జగన్ కుమ్మక్కై కేసు విచారణను జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసుల విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కాగా ఏపీ సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామరాజు సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు పిటిషన్లను సుప్రీం ధర్మాసనం జనవరి 19 విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దు, ట్రాన్స్ ఫర్ పిటిషన్లపై సీబీఐకి గతంలోనే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసిన సంగతి విదితమే. జగన్ బెయిలు రద్దు, ట్రాన్స్ ఫర్ పిటిషన్ల విచారణను ఏప్రిల్ కు 1కు వాయిదా వేసింది. దీంతో ఆ పిటిషన్ ఇప్పుడు విచారణకు వచ్చింది.