posted on Apr 1, 2024 9:36AM
తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు పోటీలు పడుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీలు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత దగ్గరి వ్యక్తిగా పేరున్న కె.కేశవరావుసైతం బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నందమూరి సుహాసిని సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. రెండు రోజుల క్రితం నందమూరి సుహాసిని సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షీలతో భేటీ అయ్యారు. కేవలం మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నప్పటికీ.. ఆమె త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారనీ, ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతున్నది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే13న తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ ఎస్, బీజేపీలు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా.. ఖమ్మం, వరంగల్ తోపాటు మరి కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందినితో పాటు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి సుహాసిని పేరు తెరపైకి రావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నందమూరి సుహాసిని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థిగా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల ఆమె సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీని కలిశారు. ఖచ్చితంగా రాజకీయ ఎజెండాతోనే సమావేశం జరిగి ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంచార్జిలను ఆదివారం నియమించారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంచార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. దీంతో పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, నందమూరి సుహాసినీ పేరుకూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలకు తొమ్మిది స్థానాల్లో విజయం సాధించడానికి తెలుగుదేశం కార్యకర్తల మద్దతే ఓ కారణమని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలోనే కాుండా, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలలో కూడా తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఒక అంచనా ప్రకారం ఖమ్మంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్యనే పోరు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకే మరోసారి టికెట్ కేటాయించింది. నామా నాగేశ్వరరావు తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తే కావడంతో ఆయనకు తెలుగుదేశం క్యాడర్ తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాడర్ తో పాటు, తెలుగుదేశం క్యాడర్ కూడా నామాకు మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో కేసీఆర్ నామాకే టికెుట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ వ్యూహం మార్చి తెలుగుదేశం క్యాడర్ నామా వెంట వెళ్లకుండా ఉండేందుకు నందమూరి సుహాసినీని ఖమ్మం బరిలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నందమూరి సుహాసినీని ఖమ్మం బరిలో నిలిపితే కాంగ్రెస్ క్యాడర్ తో పాటు టీడీపీ బలం కూడా తోడవుతుందని, తద్వారా కాంగ్రెస్ విజయం నల్లేరుపై బండినడక అవుతుందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నేతలే పోటీపడుతున్నారు. వీరందరినీ కాదని సుహాసినీని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇస్తే.. పార్టీలో ఉన్న నేతల సహకారం ఎంతమేరకు ఆమెకు ఉంటుందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే, నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు లేవని, కేవలం రేవంత్ రెడ్డితో నందమూరి కుటుంబానికి ఉన్న సత్సంబంధాల కారణంగానే మర్యాదపూర్వకంగా ఆమె సీఎంను కలిశారని తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ప్రకటించేంత వరకు ఇలాంటి ఊహాగానాలు తెరపైకి వస్తూనే ఉంటాయని పలువురు పార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు.