posted on Mar 30, 2024 12:31PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే నామమాత్రంగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఆ పార్టీ పట్ల ఆగ్రహం చల్లారిన దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్.. తెలంగాణలో బలంగా పుంజుకుంది. అధికారపగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని తన పోరాటం ద్వారా సాధించానని చెప్పుకుంటూ తెలంగాణ పితగా తనకు తానే కితాబులిచ్చేసుకున్న కేసీఆర్ పార్టీని ఆ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అయితే ఇది జరగడానికి పదేళ్లు పట్టింది.
అయితే ఏపీలో మాత్రం అడ్డగోలు విభజన ఆగ్రహం ప్రజలలో ఇంకా చల్లారినట్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిలో కర్నాటక, తెలంగాణలలో అధకారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీపై దృష్టి సారించింది. ఏపీలో పుంజుకోవాలంటే వైఎస్ బ్రాండ్ ను జగన్ నుంచి తమ పార్టీకి బదలాయించుకోవడమొక్కటే మార్గమని భావించింది. అందుకే వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిలకు పార్టీ ఏపీ పగ్గాలు అప్పగించింది. షర్మిల అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో తన తండ్రి పేరు మీద వైఎస్సార్టీపీ పార్టీని ఏర్పాటు చేసుకుని తన స్థాయిలో తాను రాజకీయం చేసుకున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా ఆమె కాంగ్రెస్ కు మద్దతుగా ఎన్నికలలో తన పార్టీని పోటీ నుంచి పక్కన పెట్టేశారు.
ఆ తరువాత ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీ ఏపీ పగ్గాలు అందుకున్నారు. ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల అలా తన అన్నపై విమర్శల బాణాలు సంధించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మైలేజీ పెరిగిందని పరిశీలకులు సైతం విశ్లేషించారు. సూటిగా జగన్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ, తన తండ్రి వైఎస్ ఆశయాల సాధన కోసమే తాను కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ ఏపీ పగ్గాలు పట్టుకున్నానని కూడా గట్టిగా చెప్పారు. అంతేనా సొంత బాబాయ్ వివేకా హత్య కేసు ఛేదనలోలో కూడా జగన్ దర్యాప్తు సంస్థలకు అడుగడుగునా అడ్డుపడింది కూడా జగనేనని ఆమె విస్పష్టంగా ప్రకటించేశారు. వివేకా 5వ వర్ధంతి సభలో వివేకా కుమార్తె సునీతతో కలిసి వేదిక పంచుకుని, ఆ వేదిక సాక్షిగా తన అన్నకు ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. తాను కడప లోక్ సభ, లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తాననీ ప్రకటించారు. ఇందు కోసం ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కడప నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అంతే ఆ తరువాత నుంచీ ఆమె అనూహ్యంగా మౌనముద్ర వహించారు. అంతే కాదు బహిరంగంగా ఎక్కడా సభలు సమావేశాలలో కనిపించడం లేదు.
ఒక పక్క ఎన్నికల షెడ్యూల్ విడుదలై అన్ని పార్టీలూ ప్రచారంలో పరుగులు పెడుతుంటే.. ఏపీ కాంగ్రెస్ లో మాత్రం ఎన్నికల హడావుడి ఏమీ కనిపించడం లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కనిపించడం లేదు. వినిపించడం లేదు. దీంతో రాజకీయవర్గాలలోనే కాకుండా కాంగ్రెస్ శ్రేణులలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షర్మిల కాడె వదిలేశారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సరిగ్గా ఈ సమయంలోనే ఇంత కాలం కుమారుడు జగన్ కు దూరంగా కుమార్తె షర్మిలతో ఉన్న వైఎస్ సతీమణి విజయమ్మ ఇడుపుల పాయలో జగన్ పక్కన ప్రత్యక్షమయ్యారు. జగన్ తన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర ద్వారా ప్రారంభించారు. ఆ సందర్భంగా ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన సమావేశంలో విజయమ్మ పాల్గొన్నారు. కొడుకును బైబిల్ సాక్షిగా దీవించారు. దీంతో షర్మిల కూడా తన స్టాండ్ మార్చుకున్నారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీలో ఉత్సాహం కలిగించేలా వరుస సభలూ సమావేశాలతో దూసుకుపోవాల్సిన తరుణంలో షర్మిల సైలెంట్ కావడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వంటి కార్యక్రమాలకు ఇంకా శ్రీకారం చుట్టకపోవడంతో తెరవెనుక ఏదైనా జరిగిందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. తల్లి విజయలక్ష్మిని తనకు అనుకూలంగా చేసుకున్న జగన్ చెల్లి షర్మిలను తన వైపు తిప్పుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నిటినీ నివృత్తి చేయాల్సిన షర్మిల ఇకనైనా మౌనం వీడాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు?