posted on Mar 30, 2024 3:19PM
ముఖ్యమంత్రి సభలకు కూడా జనం మొహం చాటేస్తున్నారు. దీంతో వైసీపీ ఎన్నికల ప్రచారం ఆరంభంలోనే హంసపాదు అన్నట్లుగా తయారైంది. జగన్ ఆర్భాటంగా ఆరంభించిన బస్సు యాత్ర తుస్సు మంటోదన్న భావన వైసీపీ క్యాడర్ లోనే వ్యక్తం అవుతోంది. బస్సు యాత్ర కు జన స్పందన అమోంగా ఉందన్న బిల్డప్ ఇవ్వడానికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలయ్యాయి. మరో వైపు ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి ప్రసంగం వినడానికి కూడా జనం ఇష్టపడటం లేదనడానికి నిలువెత్తు నిదర్శనంగా నెల్లూరు జిల్లా సీతారామపురంలో జరిగిన సంఘటన నిలుస్తోంది. ఉదయగిరి లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం (మార్చి 28) సీతారాంపురంలో పర్యటించారు. తన ప్రచార రథంపై పర్యటించిన ఆయన జనాలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారో లేదో జనం లేచి వెళ్లిపోవడం మొదలెట్టారు. దీంతో నేతలు మైకుల్లోనే నాయకుడి ప్రసంగం వినండి, సభ అయిపోయిన తరువాత భోజనాలు కూడా ఉన్నాయి. దయచేసి వెళ్లిపోకండి అని వేడుకోవలసి వచ్చింది. ఇందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయింది.
దీనిపై అధినేత సభలే జనం లేక వెలవెలబోతుంటే ఇంక ఆ పార్టీ నేతల సభల సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవడమెందుకు అంటూ పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. ఇక విషయానికి వస్తే… తొలి రెండు రోజులూ బస్సు యాత్ర తుస్సు మనడంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. సీఎం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగన్ బస్సు యాత్రను విజయవంతం చేయడానికి వారు డబ్బు పంపిణీపై ఆధారపడ్డారు. ఎమ్మిగనూరు సభకు వచ్చిన మహిళలకు వైసీపీ నాయకులు డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. సీఎం సభ కోసం వచ్చిన మహిళలను వైసీపీ నాయకులు ఓ చోటుకి చేర్చారు. డబ్బులు ఉంచిన కవర్‌లను మహిళలకు పంచారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు బెదరించ బెల్లించో, సొమ్ములు పంచో, మందు సరఫరా చేసో జనాలను తరలించిన వైసీపీ నేతలకు కోడ్ అమలులోకి వచ్చిన తరువాత అది అంత ఈజీ టాస్క్ గా కనిపించడం లేదు. కోడ్ అమలుకు ముందు సభకు రాకపోతే పథకాలు ఇవ్వరనో, అక్రమ కేసులు బనాయిస్తారనో, దాడులకు పాల్పడతారనో భయంతో ఇష్టం లేకపోయినా బలవంతపు బ్రాహ్మణార్ధం అన్నట్లు జనం సభలకు వచ్చే వారు. ఎప్పుడైతే కోడ్ అమలులోకి వచ్చిందో జగన్ సభ అంటే చాలా జనమే కాదు, వైసీపీ క్యాడర్ కూడా లైట్ తీసుకుంటోంది. దీంతో సీఎం ఎమ్మిగనూరు సభకు ఎలాగైనా సరే జనాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో బహిరంగంగానే డబ్బులు పంచుతూ వైసీపీ నేతలు వీడియోకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఇక ఆ పంపిణీ కూడా సరిగ్గా జరగలేదంటూ పలువురు మహిళలు ఆందోళనకు దిగడంతో వైసీపీ పరువు గంగలో కలిసింది. వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి.. కొందరికి మాత్రమే వెయ్యి ఇచ్చి మిగిలిన వారికి తక్కువ డబ్బులు ఇచ్చారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో వైసీపీ నేతలు ఎలాగోలా వారికి సర్ది చెప్పి సముదాయించారు.
బస్సులు పెట్టినా, డబ్బులు పంచినామద్యం పారించినా జగన్ సభలకు జనం అంతంత మాత్రంగానే వస్తున్నారు. ఆ వచ్చిన జనం కూడా జగన్ ప్రసంగం వినడానికి ఇష్టపడటం లేదు. డబ్బులు పుచ్చుకున్నాం కనుక వచ్చాం, హాజరు వేయించుకున్నాం ఇక చాలు అన్నట్లు మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు. మరో వైపు పరదాలు లేకుండా జగన్ చేస్తున్న రోడ్ షోలో ఆయన ప్రజా నిరసనను ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. సీఎం ముఖ్యమంత్రి జగన్కు కర్నూలు జిల్లాలో నిరసన సెగ తగిలింది. కోడుమూరు మండలం రామచంద్రాపురం వాసులు బిందెలతో నిరసన తెలిపారు. ఎమ్మిగనూరు బహిరంగ సభకు వెళుతుండగా మార్గమధ్యంలో ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగా ఆయన బస్సును అడ్డుకున్నారు. అలాగే వామపక్షాలు కూడా బస్సు యాత్ర సందర్భంగా నిరసనకు దిగి తాగునీటి సమస్య పరిష్కారం కోసం డిమాండ్ చేశాయి. కాగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
కాగా ఒక వైపు జగన్ సభకు జనం రావడం లేదు. అదే సమయంలో నిరసనలకు కూడా దిగుతుంటే మరో వైపు విపక్ష నేత చంద్రబాబు సభలకు జనం స్వచ్ఛందంగా లక్షల సంఖ్యలో తరలిరావడం చూస్తుంటే.. మే 13న జరిగే ఎన్నికలలో జనం ఓటు ఎవరికో ఇప్పటికే నిర్ణయించేసుకున్నారని తేటతెల్లమౌతోంది. జగన్ ఓటమికి ఆయన బస్సుయాత్ర తుస్సుమనడమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరో వైపు చంద్రబాబు సభలకు తండోపతండాలుగా జనం వెల్లువెత్తడం చూస్తుంటూ వచ్చే ఎన్నికలలో విజయం ఎవరిని వరించబోతోందన్నది అర్ధమైపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.