posted on Mar 30, 2024 12:59PM
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అసలే అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోలేక సతమతమౌతున్న పార్టీకి ఒకదాని వెంట ఒకటిగా కష్టాలు చుట్టుముట్టేస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, సీనియర్లే పార్టీ నుంచి జంప్ కొట్టేయడం. లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకకపోవడం, అభ్యర్థిగా ప్రకటించిన తరువాత పోటీ నుంచి వైదొగడంతో పార్టీ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి.
ఈ తరుణంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై వరుసగా కేసులు నమోదు కావడం బీఆర్ఎస్ ను మరిన్ని కష్టాల్లోకి నెట్టివేసినట్లైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ హన్మకొండయ పీఎస్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తాజాగా శనివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేటీఆర్ పై ఐ పీసీ 504,505(2) కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించారంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఈ కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.