posted on Mar 30, 2024 2:43PM
తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్న కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయించే దిశగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కూతురు కడియం కావ్యకు టిక్కెట్ కూడా ఇప్పించుకున్నారు. కానీ కొన్ని రోజులకే వారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చేందుకు అసెంబ్లీకి వచ్చారు.
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ శనివారం అసెంబ్లీకి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో అసెంబ్లీ కార్యదర్శికి పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన కూడా లేరని చెప్పడంతో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెనుదిరిగారు. కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని వారు కోరనున్నారు. స్పీకర్ అపాయింటుమెంట్ తీసుకొని అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు.
కడియం శ్రీహరి చాలా కాలం పాటు టీడీపీలో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి వంటి సీనియర్ పదవుల్లో పనిచేశారు.
ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి 2014లో వరంగల్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
అయితే ఏడాదిన్నర తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి శాసనమండలికి ఎన్నికయ్యేలా చేసి ఉప ముఖ్యమంత్రిని చేశారు అప్పటి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్.
శ్రీహరి నిష్క్రమణ, అతని కుమార్తె కావ్య పోటీ నుండి వైదొలగడం నిజంగా బిఆర్ఎస్ కు షాక్ అనే చెప్పాలి.