రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా మా వద్ద ఉంది
భువనగిరి ఎంపీ సీటును రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టెలిఫోన్ యాక్ట్ కేంద్రానికి సంబంధించిదని, ఫోన్ ట్యాపింగ్ కేసును(Phone Tapping Case) సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమవద్ద ఉందన్నారు. హైదరాబాద్ లో డబ్బులు వసూలు చేసి దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వాడుతుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గతంలో రంజిత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు గుర్తులేదా? అని ప్రశ్నించారు. రంజిత్ రెడ్డి అవినీతిపరుడు అని ఆరోపించిన రేవంత్ ఇప్పుడు టికెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు. లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) రంజిత్ రెడ్డికి ఓటు వేయాలని ఎలా అడుగుతారని నిలదీశారు. నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి తాను షిండే పాత్ర పోషిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నది వాస్తవమన్నారు. కాంగ్రెస్ లో సైతం కోమటిరెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదన్నారు.