posted on Mar 29, 2024 3:35PM
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బబీజేపీ, బీఆర్ఎస్ లు ఇప్పుడు ఆ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులపై మల్లగుల్లాలు పడుతున్నాయి.
బీఆర్ఎస్ వరంగల్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీ నుంచి వైదొలగడంతో అక్కడ మరో అభ్యర్థిని నిలబెట్టక తప్పని పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. దీంతో బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థిగా బాబూమోహన్ ను నిలబెట్టాలని భావిస్తున్నది. బీఆర్ఎస్ కు రాజీనమా చేసి బీజేపీలోకి అక్కడ నుంచి కేఏపీల్ విశ్వశాంతి పార్టీలోకీ మారిన బాబూమోహన్ ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ బామూమోహన్ ను నిలబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులే చెబుతున్నాయి.
ఇక సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన దానం నాగేందర్ ను మార్చాలన్న యోచనలో ఆ పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన దానం నాగేందర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టులు పిటిషన్ దాఖలైంది. అది అలా ఉంచితే కాంగ్రెస్ అధిష్ఠానం దానం నాగేందర్ ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది.
ఆయన రాజీనామా చేస్తేనే సికిందరాబాద్ ఎంపీగా టికెట్ ఇస్తామని చెప్పినా కూడా రాజీనామాకు దానం ససేమిరా అంటుండడంతో కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ గా ఉందనీ, సికిందరాబాద్ నియోజకవర్గంలో దానం కు బదులుగా మరో వ్యక్తిని నిలపాలని భావిస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయ. తాజా సమాచారం మేరకు దానం నాగేందర్ ను సికిందరాబాద్ అభ్యర్థిగా తప్పించి ఆయన స్థానంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నది.