posted on Mar 23, 2024 11:40AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హయాంలో ప్రజలకు హక్కులు అనేవి లేకుండా పోయాయి. అలాంటి రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఎందుకు అనుకున్నారో ఏమో సీఎం జగన్ రెడ్డి మానవ హక్కుల కమిషన్ న్యాయమూర్తికి కనీసం స్టెనోగ్రాఫర్ ను కూడా కేటాయించలేదు. ఎలాంటి సౌకర్యాలూ, హక్కులూ లేకుండానే ఏపీలోని మానవ హక్కుల కమిషన్ పదవీ కాలం ముగిసింది.
అసలు తొలి నుంచీ కూడా ఏపీ సీఎంకు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ అటువంటి ఒక కమిషన్ ఉండాలి కనుక ఇద్దరు సభ్యులతో ఉన్న కమిషన్ రాష్ట్రంలో పని చేసింది. మామూలు ప్రొసీజర్ ప్రకారం హక్కుల కమిషన్ సభ్యుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కోడ్ పుణ్యమా అని ఎన్నికలు పూర్తై కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ రాష్ట్రంలో హక్కుల కమిషన్ పని చేసే పరిస్థితి లేదు. ఏదో తప్పక కానీ జగన్ రూలింగ్ లో హక్కులే లేనప్పుడు ఇక హక్కుల కమిషన్ ఏమిటని పరిశీలకులు గతంలో పలు సందర్భాలలో సెటైర్లతో విరుచుకుపడ్డారు. సరే అసలు విషయానికి వస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో హక్కుల కమిషన్ ఏర్పాటుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుచేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం, వాటిని విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు రాష్ట్రంలో మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. కానీ కోర్టులు, కోర్టు తీర్పుల పట్ల పెద్దగా పట్టింపు లేని జగన్ ఆ ఆదేశాలకు ఖాతరు చేయలేదు. దీంతో ప్రభుత్వంపై కోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు కావడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత జగన్ సర్కార్ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటుచేసింది.
జస్టిస్ మాంధాత సీతారామమూర్తి చైర్మన్‌గా, దండె సుబ్రమణ్యం, డాక్టర్ జి.శ్రీనివాసరావు జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా కమిషన్ ఏర్పడింది. కానీ హైదరాబాద్‌లో ఉమ్మడి హక్కుల కమిషన్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హక్కుల కమిషన్ స్వాధీనం చేసుకోవడంతో ఏపీ హక్కుల కమిషన్‌కు నిలువనీడ లేకుండా పోయింది. అయితే మూడేళ్ల పదవీ కాలంలో హక్కుల కమిషన్ చైర్మన్ మాంధాత సీతారామమూర్తి కారు, డ్రైవర్, స్టెనోగ్రాఫర్, ఫోను కూడా లేకుండానే లేకుండా పని చేశారు. దీనిపై మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు రావడంతో స్పందించిన ప్రభుత్వం, ఎట్టకేలకు ఆయనకు కారు, డ్రైవర్‌ను ఏర్పాటుచేసింది. అరకొర సౌకర్యాలతోనే కమిషన్ కొనసాగింది. అయితే జగన్ పాలనలో అరాచకాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే అరకొర వసతులు, కనీసం కార్యాలయం కూడా లేని దుస్థితి, చాలీచాలని సిబ్బంది కారణంగా కమిషన్ ఫిర్యాదుల పరిష్కారంలో ఇబ్బందులు ఎదుర్కొంది.
దీనిపై కూడా మీడియా కథనాల కారణంగానే కోర్టు జోక్యం చేసుకుంది. కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఏపీ కమిషన్ కార్యాలయం ఏపీలో ఏర్పాటైంది. పరిమిత సిబ్బందితో స్టేట్ గెస్ట్ హౌస్‌లో కొద్దికాలం కోర్టు నడిచింది. ఆ తరువాత కర్నూలుకు తరలింది. అయితే కమిషన్ కు కనీస సౌకర్యాలు, వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి తన పదవీ కాలం అంతా తన తీర్పులు తానే టైప్ చేసుకున్నారంటే పరిస్థితి ఏమిటో అవగతమౌతుంది. రిజర్వు చేసిన తీర్పు ఆలస్యం కావడానికి తనకు స్టెనోగ్రాఫర్ లేకపోవడమే కారణమని స్వయంగా చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి ప్రొసీడింగ్స్‌లో రాసుకున్నారంటే హక్కుల కమిషన్ విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం అర్థం చేసుకోవచ్చు. సరే ఇప్పుడు పదవీ కాలం ముగిసింది కనుక ఏపీలో హక్కుల కమిషన్ లేదు. కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది కదా. అయినా జగన్ పార్టీ ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగిపోతూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం అరకొరగా స్పందించి కొందరిపై చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా జరిగే పరిస్థితులు కానరావడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప ఇక్కడ పరిస్థితులు చక్కబడే అవకాశాలు లేవంటున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కేవలం ప్రతిపక్షాల కోసం మాత్రమే ఉందా అన్నట్లుగా పరిస్థితి ఉందన్న ఆరోపణలకు వెల్లువెత్తుతున్నాయి. మానవహక్కుల కమిషన్ హక్కులనే హరించేసిన జగన్ ప్రతిపక్షాలు హక్కులను ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గన్నవరంలో శుక్రవారం (మార్చి 22) కడప అసెంబ్లీ నియోజవకర్గ తెలుగుదేశం అభ్యర్థి రెడ్డప్పగారి మాధవిపై వైసీపీ గూండాలు దాడి చేసిన సందర్భంగా పోలీసుల వ్యవహార శైలిని ఉదాహరణగా చూపుతున్నారు.
దాడికి పాల్పడిన వైసీపీ వర్గీయులను వదిలేసి కారు నిలిపి ట్రాఫిక్ జాంకు కారణమయ్యారంటూ మాధవిని పోలీసు స్టేషన్ కు రావాలని పోలీసులు కోరడమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎంత దివ్యంగా అమలు అవుతోందనడానికి నిరదర్శనంగా పరిశీలకులు చూపుతున్నారు. ఏపీలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే కోడ్ ఉల్లంఘనలపై సీ విజిల్ యాప్ లో ఫొటోలు తీయడానికి కూడా అవకాశం లేకుండా వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.