వృద్ధ దంపతులకు నర్సాపూర్ కోర్టులో న్యాయం
స్థిర,చరాస్థులను కోల్పోయి కన్న కొడుకు చేసిన మోసంతో కన్నీరు పెట్టుకుంటూ వృద్ధ దంపతులు మెదక్ జిల్లా(Medak) నర్సాపూర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆ వృద్ధ దంపతుల గోడును విన్న జడ్జి వెంటనే స్పందించి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన గండి లచ్చయ్య, తులసమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మధుసూదన్ ఉన్నాడు. కొన్నాళ్ల కిందట మధుసూదన్ తల్లిదండ్రుల(Son Cheating Parents) పేరిట ఉన్న స్థిర,చరాస్థులను తమకు తెలియకుండా మోసపూరితంగా అతడి పేరు మీదికి మార్పించుకున్నాడు. ఇంట్లో ఉండకుండా ఇంటికి తాళం వేయడంతో తాము రోడ్డున పడ్డామని శుక్రవారం తమకు న్యాయం చేయాలనీ వృద్ధ దంపతులు వేడుకున్నారు. నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు(Narsapur Court) జడ్జి అనిత స్పందించారు. మధుసూదన్ తో ఫోన్ లో మాట్లాడి తల్లిదండ్రులను మోసం చేసి పొందిన ఇంటిని తక్షణమే వారికి స్వాధీనం చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో అతడు తాళాలు పంపించడంతో వాటిని న్యాయమూర్తి… వృద్ధ దంపతులకు అందజేశారు. తల్లిదండ్రుల ఆలనా పాలనా కూతుర్లు, కొడుకులే చూసుకోవాలని లేని పక్షంలో సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం వారసులను కఠినంగా శిక్షిస్తామని జడ్జి అనిత హెచ్చరించారు. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే వారి నుంచి పొందిన ఆస్తులను కొడుకులు, కూతుర్ల దగ్గర నుంచి జప్తు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.