posted on Mar 22, 2024 8:57AM
సార్వత్రిక ఎన్నికల ముంగిట ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వరుస అరెస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంత కాలం ఊరుకుని ఈడీ ఇప్పుడే జూలు విదల్చడం వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా కొంత కాలం నుంచీ దేశ రాజకీయాలలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రకంపణలు సృష్టిస్తూనే ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట అనూహ్యంగా ఈ స్కామ్ లో ఈడీ, సీబీఐ దర్యాప్తు మందగించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత అరెస్టు వరకూ వచ్చి అప్పుడు ఈడీ వెనక్కు తగ్గడానికీ, ఇప్పుడు తనకు సమన్లపై కవిత పిటిషన్ సుప్రీంలో ఉండగానే ఆమెను ఈడీ రాత్రికి రాత్రి అరెస్టు చేసి ఢిల్లీ తరలించడానికి వెనుక ఉన్నది రాజకీయమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేయడం వెనుక ఉన్నది కూడా రాజకీయమేనని అంటున్నారు.
ఏది ఏమైనా ఢిల్లీ మద్యం కుంభకోణంలో అగ్రనేతలను ఒక్కరొక్కరుగా ఈడీ అరెస్టు చేస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేసిన రోజుల వ్యవధిలోనే ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. పదవిలో ఉండగా అరెస్టయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. మద్యం కుంభకోణం విచారణకు గాను 12 మంది సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడం గమనార్హం.
అయితే ఈ అరెస్టులన్నీ రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ ఆదేశాల మేరకే జరుగుతన్నాయని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుంటే.. చట్టం తనపని తాను చేసుకుపోతుంటే.. విపక్షాలు కేంద్రంపై ఆరోపణలు గుప్పించడం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సానుభూతి పొంది ఓట్లు దండుకోవడానికేనని అధికార బీజేపీ ఆరోపిస్తున్నది. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ముందు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడం రాజకీయంగా సంచలనం సృష్టించిందన్నది మాత్రం వాస్తవం.