posted on Mar 22, 2024 10:12AM
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏడాది మారి ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టగానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపుగా చెప్పకతప్పదు. నిజానికి షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభించిన సమయంలోనో, లేక తెలంగాణ అసెంబ్లీ ఎన్ని కలకు ముందో కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇంత ఎఫెక్ట్ కచ్చితంగా కనిపించేది కాదు. కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు, అది కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా జరగనున్న సమయంలో ఆమె హస్తం గూటికి చేరి అన్నపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం సంచలనానికి కారణమైంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె పగ్గాలు చేపట్టిన క్షణం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి, సొంత అన్నపై ఆమె చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, జగన్ పాలనలోని అరాచకాలను ఎండగడుతున్న తీరు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒకింత జోష్ ను పెంచడం అటుంచి.. తాజాగా ఆమె పార్టీ హైకమాండ్ అనుమతిస్తే పులివెందుల బరిలో తన అన్నను ఢీకొనేందుకు సైతం సై అంటూ చేసిన ప్రకటన జగన్ ను, ఆయన పార్టీనీ షేక్ చేసేసిందని చెప్పొచ్చు. అసలు షర్మిల తనకు వ్యతిరేకంగా గళం ఎత్తడం మొదలు పెట్టగానే జగన్ ధైర్యం, స్థైర్యం మటుమాయమైపోయాయి.
వాస్తవంగా చెప్పాలంటే.. ఐపాక్ సర్వేలైతేనేమి, జగన్ సొంతంగా చేయించుకున్న సర్వేలైతేనేమి రాష్ట్రంలో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని తేల్చేశాయి. దీంతో ఓటమి నుంచి తప్పించుకునేందుకు జగన్ ఎన్నో ఎత్తులు వేశారు. వ్యూహాలు రచించారు. వాటిలో జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. రెండు పార్టీలూ సమన్వయంతో పని చేయడమే కాకుండా, సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబించడంతో ఒకటి రెండు చోట్ల వినా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండానే తెలుగుదేశం, జనసేనల మైత్రీ బంధం బలపడింది. ఇక ఆ కూటమితో బీజేపీ కలవకుండా ఉండేందుకు జగన్ చేసిన ప్రయత్నాలూ బెడిసికొట్టాయి. సిట్టింగుల మార్పుతో తన ప్రభుత్వంపై అసంతృప్తిని తగ్గించుకోవాలన్న ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యాయి. సిట్టింగులపై అసంతృప్తి కంటే జగన్ పాలనపైనే ప్రజలలో ఆసంతృప్తి, ఆగ్రహం ఉన్నాయని తేటతెల్లం చేస్తూ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఇన్ని ఇబ్బందులలోనూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వైనాట్ 175 అంటే బింకంగా విపక్ష కూటమిపై అనుచిత విమర్శలను ప్రోత్సహిస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న జగన్ కు షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రం నోరు పెకలని పరిస్థితిలోకి నెట్టి వేసింది. సొంత సోదరి అని కూడా చూడకుండా వైసీపీ సమాజిక మాధ్యమంలో షర్మిల వ్యక్తిగత జీవితంపై కూడా ఇష్టారీతిన పోస్టులను ప్రోత్సహించిన జగన్ కు షర్మిల నేరుగా తనపైనే తలపడతానంటూ విసిరిన సవాల్ తో మైండ్ బ్లాక్ అయిపోయింది. ధైర్యం, స్థైర్యం సన్నగిల్లింది. సొంత అడ్డాలోనే అడుగుపెట్టడానికి బెదిరే పరిస్థితిలో జగన్ పడిపోయారు.
గత ఎన్నికలలో జగనన్న విజయం కోసం శక్తికి మించి కష్టపడిన షర్మిల ఇప్పుడు ఆయనకు బద్ధ శత్రువుగా, పక్కలో బల్లెంగా మారింది. జగన్ ను ఉద్దేశించి నేరుగా, సూటిగా ఆమె చేస్తున్న విమర్శలు వైసీపీలో కాకపుట్టిస్తున్నాయి. కడప లోక్ సభ బరిలో షర్మిల దిగనున్నారన్న వార్తలు వైసీపీలో అంతంత మాత్రంగా ఉన్న గెలుపు ఆశలను ఆవిరి చేసేశాయి. అది చాలదన్నట్లు తాజాగా షర్మిల అధిష్ఠానం ఆదేశిస్తే జగన్ ప్రత్యర్థిగా పులివెందుల అసెంబ్లీ బరిలోనైనా నిలవడానికి రెడీ అన్న ప్రకటన జగన్ ను పూర్తిగా డీలా పడేలా చేసింది.
వాస్తవానికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ షర్మిల తన అన్న, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రభుత్వ అరాచకాలను ఎత్తి చూపుతూనే ఉన్నారు. ఇప్పడు తాజాగా ఆమె పులివెందుల గడ్డపై జగన్ తో ఢీకొంటానని చేసిన ప్రకటనపై అధిష్ఠానం సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి. నిజానికి షర్మిల కడప లోక్ సభ బరిలో నిలిచినా, ఆ ప్రభావం పులివెందుల లో జగన్ విజయావకాశాలపై తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటిది షర్మిల నేరుగా తన అన్నకు ప్రత్యర్థిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే జగన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేతగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వైసీపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయాల్సిన జగన్ పులివెందులకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనీ, అలా పరిమితమైనా గెలుపు అవకాశాలు మాత్రం అనుమానమేననీ స్థానికులు బాహాటంగానే చెబుతున్నారు.