posted on Mar 21, 2024 3:01PM
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో రోజుకో కొత్త సంచలనం వెలుగులోకి వస్తున్నది. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను విచారిస్తున్న క్రమంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటి వరకూ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లే ట్యాప్ చేసారని భావిస్తుంటే.. పలువురు సినీ హీరోయిన్ల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు వెలుగులోనికి వచ్చింది.
ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తున్నాయి. వీరి ఫోన్లను ట్యాప్ చేసి సమాచారం అంతా రాజకీయనేతలకు అందించినట్లు ప్రణీత్ రావు తన విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం పలువురు హీరోయిన్ల ఫోన్ కాల్స్ రికార్డు కూడా చేశారని అంటున్నారు. అంతే కాకుండా వారి చాట్ హిస్టరీని చోరీ చేసి, ఆ డాటాను పెన్‌డ్రైవ్‌లు, ఈ మెయిల్స్ ద్వారా కొందరు బడా రాజకీయ నేతలకు చేరవేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఆ డేటా ద్వారా హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి ఉంటారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో బడాబడా రాజకీయ నేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు ఈ పోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉందన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఆయనే కాకుండా బీఆర్ఎస్ కీలక నేతల పేర్లు కూడా వినవస్తున్నాయి.
మొత్తం మీద ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తాయో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఫోన్ లు ట్యాప్ అయిన నేతలలో ప్రతిపక్షాలకు చెందిన వారే కాకుండా అధికార బీఆర్ఎస్ నేతలూ ఉన్నారని సమాచారం. అలాగే ఈ ట్యాపింగ్ ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదనీ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బడా నేతల ఫోన్లను సైతం ట్యాప్ చేశారనీ అంటున్నారు.