Saturday, October 19, 2024

ఆ మూడు చోట్లా వైసీపీ గెలుపు ఆశలు గల్లంతేనా? | ycp win dreams disappear in those| three constituencies| prakasham| district| combined| jagan | deny| tickets| sittings| reluctent

posted on Mar 21, 2024 11:28AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వచ్చే ఎన్నికలలో జిల్లాలో వైసీపీకి ఘోర పరాజయం తథ్యమని ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కూడా జగన్ పార్టీ ఓటమి దిశగానే నడుస్తోందని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైసీపీకీ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో పార్టీ గుర్తు ఫ్యాన్ కే గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. 

ప్ర‌జ‌ల్లో  పార్టీ పట్ల వ్యతిరేకతను గుర్తించిన జగన్  దానిని సాధ్యమైనంత తగ్గించాలన్న ఉద్దేశంతో  చేసిన సిట్టింగుల మార్పు ప్రయోగం మరింత చేటు చేసిందని జిల్లా పార్టీ శ్రేణులు అంటున్నాయి.  ఇప్పుడు జిల్లాలో ముగ్గురు సిట్టింగులు అయితే జగన్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ముగ్గురికీ కూడా తామ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం నుంచి జగన్ టికెట్ ఇవ్వకపోవడమే కాదు,  అసలు పోటీ చేసేందుకు ఏ నియోజకవర్గం నుంచీ టికెట్ ఇవ్వలేదు.  

వారు మేడిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబు, మహీధర్ రెడ్డిలు. ముగ్గురూ కూడా తమ పట్ల జగన్ వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహంతో  ఉన్నారు. ఈ ముగ్గురూ కూడా చివరి క్షణం వరకూ తమకు తమతమ నియోజకవర్గాల నుంచే పోటీ చేసేందుకు జగన్ టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే పార్టీ ప్రకటించిన జాబితాతో  తమకు  అసలు పోటీ చేసే అవకాశమే లేకుండా పోవడంతో రగిలిపోతున్నారు.  

వీరిలో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అయితే  పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.  ఆయన ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఒక దశలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి.  అయితే అక్కడ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఇప్పుడాయన మొత్తంగా ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసేది లేదని సన్నిహితులకు, సహచరులకూ చెప్పడమే కాకుండా వారినీ పార్టీకి దూరంగా ఉండాలని కోరినట్లు చెబుతున్నారు.  

అదే విధంగా  ఎమ్మెల్యే మేడిశెట్టి వేణుగోపాల్ తన సీటు మారిస్తే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారనీ, అయితే జగన్ అందుకు కూడా నిరాకరించి పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన పార్టీకి, పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. తన నియోజకవర్గం బాచేపల్లిలో పార్టీ ప్రచారంలో పాల్గొనేది లేదని తెగేసి చెప్పేశారని అంటున్నారు. అంతే కాకుండా తన అనుచరులు, తన వర్గీయులెవరూ పార్టీ ప్రచారంలో పాల్గొనద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, లేదా జనసేన గూటికి చేరదామని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మేడిశెట్టి వేణుగోపాల్ మొత్తంగా ఈ సారి ఎన్నికలలో  సైలెంటైపోవడానికి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఇక టికెట్ దక్కని మరో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును బుజ్జగించేందుకు మాత్రం వైసీపీ అధినేత ఒకింత ప్రయత్నం చేశారు. ఆయనను ఒంగొలు లోక్ సభ నియోజకవర్గ డిప్యూటీ కోఆర్డినేటర్  పదవి ఇస్తామని ప్రతిపాదించారు. సంతనూతల పాడు నియోజకవర్గంలో గట్టి పట్టున్న సుధాకర్ బాబు సేవలను ఆ విధంగా ఉపయోగించుకోవాలని జగన్ ప్రయత్నించినప్పటికీ సుధాకర్ బాబు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, ఆయన నేడో రేపో పార్టీ వీడే అవకాశాలున్నాయనీ అంటున్నారు. జిల్లా వైసీపీకి చెందిన మరికొందరు కీలక నాయకులతో కలిసి ఆయన తెలుగుదేశం, లేదా జనసేన గూటికి చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ ఆయన సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించకపోవడమే కాకుండా, తన వర్గీయులెవరూ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. సుధాకరబాబు అసంతృప్తి కచ్చితంగా సంతనూతలపాడులో వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున విజయావకాశాలను గణనీయంగా దెబ్బతీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తంగా ప్రకాశంలో వైసీపీ ప్రకాశం కోల్పోయిందని అంటున్నారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana