posted on Mar 21, 2024 10:42AM
వైసీపీ ప్రయాస కారణంగానే ఇంత కాలం కాపు సామాజిక వర్గంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అదే సమాజిక వర్గం దృష్టిలో దోషిగా, ద్రోహిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అదే విధంగా జనసేనాని పవన్ కల్యాణ్ కు శ్రేయోభిలాషినంటూ వరుస లేఖలతో పొత్తు విషయంలో కన్ఫ్యూజన్ సృష్టించేందుకు చేసిన ప్రయత్నాల కారణంగా చేగొండి హరిరామ జోగయ్య కూడా ఇప్పుడు ఆ సమాజిక వర్గంలో ఒక జోకర్ గా మిగిలారని చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేనల మధ్య పొరపొచ్చాలు సృష్టించి పొత్తును విచ్ఛిన్నం చేయడానికీ లేదా ఆ పొత్తుకు వ్యతిరేకంగా కాపు సాజిమిక వర్గాన్ని సమీకరించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో, ఆ కూటమితో బీజేపీ కలవకుండా ఉండేందుకు వైసీపీ నడుంబిగించింది. ఇందు కోసం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి.. మోడీ స్థాయిలో ఇన్ ఫ్లుయెన్స్ చేయాలన్న ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. అసలు జగన్ కు మోడీ అప్పాయింట్ మెంటే దొరకలేదు. వారాల తరబడి వేచి చూసినా మోడీ నుంచి స్పందన లేకపోవడంతో ఇక వైసీపీ తనదైన ప్రచారంతో ఇప్పుడు బీజేపీ తరఫున ఆ పార్టీకి అన్యాయం జరుగుతోందంటూ ఎలుగెత్తుతోంది. పొత్తులో భాగంగా ఏపీ బీజేపీకి తీరని నష్టం వాటిల్లిందని లీటర్ల కొద్దీ కన్నీరు కార్చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియాలో బీజేపీపై సానుభూతితో పోస్టులు నిండిపోతున్నాయి.
ఇంతకీ వైసీపీ బాధ ఏమిటంటే తెలుగుదేశం, జనసేన కూటమిలో కలిసిన బీజేపీకి పొత్తులో భాగంగా అన్నీ ఓడిపోయే సీట్లే దక్కాయన్నది. బీజేపీని చంద్రబాబు మోసం చేశారనీ, పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఓటమి గ్యారంటీ సీట్లను కేటాయించారనీ పాపం వైసీపీ తీవ్రంగా బాధపడిపోతోంది. బీజేపీ గట్టిగా పట్టుపట్టి గెలుపు స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీకి సూచనలూ, సలహాలూ ఇచ్చి పారేస్తోంది. ఇందుకు మీడియానూ, సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకుని పేజీలకు పేజీలు, పేరాలకు పేరాలు కథనాలు వండి వార్చేస్తోంది. చివరాఖరికి నిన్న మొన్నటి వరకూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కాదు తెలుగుదేశం మనిషి అంటూ విమర్శలు గుప్పించిన పురంధేశ్వరికి రాజమండ్రీ సీటు కేటాయించడం ద్వారా ఆమెను లోక్ సభలో అడుగుపెట్టనీయకుండా చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని అంటోంది.
అసలు ఇంతకీ బీజేపీ ఏపీలో గెలిచే స్థానాలలోనే పోటీ చేయాలంటే.. ఆ పార్టీ గెలిచే స్థానం ఏదో వైసీపీ చెప్పగలగాలి? అలా చెప్పగలదా? నిజంగానే బీజేపీ గెలిచే స్థానాలలోనే పోటీ చేయాలి అనుకుంటే ఏపీలో ఆ పార్టీ పోటీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే గత ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు నోటాతో పోటీ పడిన సంగతి తెలిసిందే.
పూర్తిగా ఒక్కటంటే ఒక్క శాతం ఓటు స్టేక్ కూడా లేని బీజేపీ ఏపీలో తెలుగుదేశం, జనసేనతో కలవడం వల్ల కచ్చితంగా లబ్ధి పొందుతోందని పరిశీలకుల విశ్లేషణ. అయితే జగన్ అండ్ కో మాత్రం బీజేపీని చంద్రబాబు మోసం చేశారనీ, ఆ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీయడానికే ఓటమి చెందే సీట్లను కేటాయించారనీ గగ్గోలు పెట్టేస్తోంది. పొత్తు ఖరారై సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయిన తరువాత కూడా ఆ పొత్తు పొసగకూడదనీ, పొసగదనీ వైసీపీ చేస్తున్న ప్రచారం, అందుకోసం పడుతున్న తపనపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు.