posted on Mar 20, 2024 11:37AM
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో ఏడు దశలలోఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చింది.
ఇప్పుడు ఏడు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ( మార్చి 20) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మేరకు దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ నియోజకవర్గాలలో ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది.
తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలకు, రాజస్థాన్ లో 12 లోక్ సభ స్థానాలు, యూపీలో ఎనిమిది, మధ్యప్రదేశ్ లో ఆరు, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఐదేసి స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది. అలాగే బీహార్ లో నాలుగు, పశ్చిమ బెంగాల్ లో మూడు లోక్ సభ స్ధానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లో రెండేసి లోక్ సభ స్థానాలకూ తొలి దశలో పోలింగ్ జరగనుంది.
ఇక ఇదే దశలో ఛత్తీస్‌గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. నోటిఫికేషన్ విడుదలైన స్థానాలకు నామినేషన్ల స్వీకరణ బుధవారం (మార్చి 20)నుంచే మొదలైంది.నామినేషన్ల స్వీకరణకు 27 తుది గడువు. 28న నామినేషన్ల పరశీలన, ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 30. పోలింగ్ ఏప్రిల్ 19న జరుగుతుంది.