Saturday, October 26, 2024

కోడ్ దారి కోడ్ దే.. ఉల్లంఘనల దారి ఉల్లంఘనలదే.. ఏపీలో జగన్మాయ! | no election code in ap| cm| 60feet| cutout| combined| east| godavari| district| jonnada| bridge| nimmagadda

posted on Mar 20, 2024 2:33PM

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది సామెత. ఏపీలో మాత్రం ఆ సామెతను సీఎం జగన్ తలచుకుంటే తప్పులకు కొదవా అని మార్చుకోవాలి. జగన్ పై ప్రేమతో అధికారులు తప్పులు చేయడానికి వెరవని విచత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఔను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉంది అంటే ఉంది. అంతే అది అమలు కాదు. ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతాయి. ఫిర్యాదులను అధికారులు పట్టించుకోరు. కోడ్ అమలుకు ఉపక్రమించరు. అది అంతే. ఎందుకలా అంటే అంతా జగన్మాయ అంటారు.  ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజా కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా చాటారు. కోడ్ ఉల్లంఘన 60 అడుగుల కటౌట్ రూపంలో  దర్శన మిస్తోందంటూ సెల్ఫీ దిగి మరీ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. 

ఇంతకీ విషయమేమిటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వంతెన వద్ద రాజమండ్రీ వెళ్లే ప్రధాన రహదారిపై ఎపీ సీఎం జగన్ 60అడుగుల కటౌట్ దర్జాగా దర్శనమిస్తోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజుల తరువాత కూడా అత్యంత ప్రధానమైన రహదారిలో అందరి దృష్టినీ ప్రముఖంగా ఆకర్షించేలా ఏర్పాటు చేసిన కటౌట్ తొలగించలేదంటే ఏపీలో ఎన్నికల కోడ్ ఎంత దివ్యంగా అమలౌతోందన్నది అర్ధమౌతుంది. ఇదే విషయాన్ని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు.

అధికారులు పని చేయడం లేదా అంటే బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. అదే జొన్నాడ వద్ద వచ్చీ పోయే వాహనాలన్నిటినీ ఎండను కూడా లెక్క చేయకుండా క్షుణ్ణంగా తనఖీలు చేసి పంపిస్తున్నారు. చిన్న చిన్న పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు గోడల మీద రాతలను తొలగించేస్తున్నారు. తుడిచేస్తున్నారు. అయితే ఘనత వహించిన అధికారులకు అంత ఘనంగా అందరికీ కనిపించేలా ఏర్పాటు చేసిన సీఎం జగన్ గారి కటౌట్ మాత్రం ఆనలేదు.  ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికార మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది కనుక సీఎం సహా రాజకీయ నాయకుల ఫొటోలేవీ కనపడకూడదనీ, అలాగే వాలంటీర్లు ఎవరూ విధుల్లో పాల్గొనకూడదనీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలా ఇచ్చేసి ఊరుకోలేదు.  ఎక్కడైన నేతల ఫొటోలు కనిపించినా, వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నా వెంటనే ఫొటోలు తీసి పంపించమని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నా, అందుకు సంబంధించిన ఆధారాలు సమాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నా.. అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు.  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దారి ఎన్నికల కోడ్ దే ఉల్లంఘనల దారి ఉల్లంఘనలదేగా ఉందనడానికి సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ కార్యదర్శి, రాష్ట ఎన్నికల సంఘం మాజీ కమిషనర్   నిమ్మగడ్డ రమేష్  సీఎం 60 అడుగుల కటౌట్ ముందు ముందు నిలబడి దిగిన సెల్ఫీయే నిదర్శనం. అయినా మన పిచ్చి కానీ  రాష్ట్రంలో పౌరపంపిణీ వాహనాలపైనా , ఈసేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలపైనా షిక్కటి షిరునవ్వుతో ఇప్పటికీ ముఖ్యమంత్రి ఫోటోలు కనిపిస్తున్నా పట్టించుకోని అధికారులు ఎక్కడో రోడ్డుపై ఉన్న 60 అడుగుల కటౌట్ ను ఎందుకు పట్టించుకుంటారు. ఎన్నికల కోడ్ కు ఏపీ సీఎం జగన్ అతీతులని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారా అన్న అనుమాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.   ఇప్పటికైనా ఎన్నికల సంఘం కళ్లు తెరిచి ఏపీలో కోడ్ ఉల్లంఘనలపై కొరడా ఝుళిపించాలని కోరుతున్నారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana