posted on Mar 20, 2024 4:11PM
ఇక ఇప్పుడు జగన్ పరిస్థితి చూస్తే ఆయనకు ఫ్యామిలీ స్ట్రోక్ గట్టిగానే తగులుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సొంత అడ్డా కడపలోనే ఆయనకు దిమ్మతిరిగేలా ఫ్యామిలీ స్ట్రోక్ తగలక తప్పదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ వైఎస్ అడ్డాగా చెప్పుకునే కడపలో ఆయన కుటుంబీకులే ప్రత్యర్థులుగా తలపడే పరిస్థితులు ఉన్నాయి. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ కుటుంబీకులే పరస్పరం తలపడే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైసీపీ అధినేత సీఎం జగన్‌పై ఆయన సొంత ఫ్యామిలీయే తలపడేందుకు సమాయత్తమౌతోంది. ఈ పరిస్థితి జగన్ కు తలనొప్పే అనడంలో సందేహం లేదు. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రంలో బలపడటమే లక్ష్యంగా కాంగ్రెస్ వేస్తున్న అడుగులు ముందుగా కడప జిల్లాలో పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ తో నడిచిన, వైఎస్ ఇలాకాలో ముందుగా బలోపేతం అయ్యే ఉద్దేశంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. అందుకే తొలుత కడప లోక్ సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలలో సత్తా చాటాలని, అలా చాటాలంటే అక్కడ జగన్ దాష్టీకాన్నీ, ఆధిపత్యాన్ని గట్టిగా అడ్డుకోగలిగే బలమైన అభ్యర్థులు రంగంలో ఉండాలనీ నిర్ణయించింది.
ఇప్పటికే కడప జిల్లాల్లో జగన్ తీరు పట్ల ఒకింత వ్యతిరేకత బలంగా వ్యక్తమౌతోంది. ముఖ్యంగా గత ఎన్నికల ముందు జగన్ సొంత చిన్నాన్న హత్య వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్న విషయంలో జిల్లా ప్రజలలో స్పష్టత వచ్చిన తరువాత జగన్ కు జిల్లాలో గతంలోలా ప్రజామద్దతు లభించడంలేదు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత వైఎస్ కుటుంబం అంతా ఒక్కటిగా నిలిచింది. కాంగ్రెస్ తో జగన్ విభేదించి సొంతంగా వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తొలుత వైఎస్ వివేకా వద్దని వారించి తాను కాంగ్రెస్ లోనే ఉండిపోయి విజయమ్మకు ప్రత్యర్థిగా రంగంలోకి దిగినా ఆ తరువాత జగన్ ను సీఎంను చేయడమే ధ్యేయంగా అన్న కుమారుడి పక్కన గట్టిగా నిలబడ్డారు. 2019 ఎన్నికల సమయంలో అయితే వైఎస్ కుటుంబం సమైక్యంగా జగన్ కు అండగా నిలిచింది. అయితే ఆ ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్కొక్కరుగా జగన్ కు దూరం అయ్యారు. అలా దూరం కావడానికి ప్రధాన కారణం మాత్రం గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో బయటపడ్డ వాస్తవాలే కారణమని చెప్పవచ్చు.
గత ఎన్నికలలో జగన్ అన్న సీఎం కావడం కోసం చెప్పులరిగేలా, గొంతు చిరిగేలా ప్రచారం చేసిన షర్మిలను తాను సీఎం అయిన తరువాత జగన్ దూరం పెట్టారు. పార్టీలో ఆమెకు ఎలాంటి హోదా కల్పించకుండా.. వేధించి చివరకు ఆమె రాష్ట్ర విడిచి వెళ్లి పొరుగు రాష్ట్రంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. అదే విధంగా బాబాయ్ వైఎస్ వివేకా కుమార్తె సునీత విషయంలో కూడా తండ్రి హత్య కేసు నిందితులకు అండగా నిలబడి ఆమెపైనే ఆరోపణలు చేయించారు. దీంతో ఆమె కూడా అన్నకు దూరం జరిగారు. ఇప్పుడు జగన్ కు ఓటు వేయవద్దని షర్మిల, సునీతలు ఇరువురూ ముక్త కంఠంతో ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా వైఎస్ ఫ్యామిలీ కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగడానికి నిర్ణయించుకుంది.
పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జగన్ పై పోటీకి సొంత చిన్నమ్మ అంటే బాబాయ్ వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగడం దాదాఫు ఖరారైందని చెబుతున్నారు. తొలి నుంచీ కడప లోక్ సభ అభ్యర్ధిగా వైఎస్ అవినాష్ రెడ్డిపై సౌభాగ్యమ్మ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే కడప లోక్ సభ బరిలో దిగితే ఆమె మొత్తం నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలుగుతారా, ఆమె కడప లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ మేరకు ప్రభావం చూపగలుగుతారు అన్నదానిపై కాంగ్రెస్ లో విస్తృతంగా చర్చ జరిగిందని తెలుస్తోంది. ఆ చర్చ అనంతరం కాంగ్రెస్ వ్యూహం మార్చిందని చెబుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప లోక్ సభ అభ్యర్థిగా పోటీలోకి దిగితే.. కడప లోక్ సభ నియోజకవర్గంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నిట్లోనూ కాంగ్రెస్ బలోపేతం అవుతుందని భావించి ఆమెను కడప నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించిందనీ, అందుకు షర్మిల కూడా సుముఖత వ్యక్తం చేశారనీ అంటున్నారు. ఇక పులివెందుల నుంచి వివేకా భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగితే అక్కడ కూడా కాంగ్రెస్ గట్టి పోటీని ఇస్తుందనీ, దీంతో మొత్తంగా కడప జిల్లాలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు మెరుగౌతాయని కాంగ్రెస్ భావిస్తోందని అంటున్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ వ్యూహం ఆ పార్టీకే కాక తెలుగుదేశం పార్టీకి కూడా మేలు చేసే విధంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పించి జగన్ సానుభూతిని ప్రోది చేసుకున్నారు. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి వివేకా హత్యతో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎటువంటి సంబంధంలేదని నిర్ద్వంద్వంగా తేలిపోవడమే కాకుండా, ఆ హత్య వెనుక ఉన్నది కుటుంబ కుట్రేననీ, ఆ కుట్రలో జగన్ కు కూడా భాగముందన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.
పైగా తన ఇంటిమనుషులే తండ్రిని హత్య చేశారని వివేకా కుమార్తె సునీత, హంతకులు తమ పక్కనే ఉంటారని ఊహించలేదని సౌభాగ్యమ్మ వెల్లడించారు. అంతే కాదు తన తండ్రి హత్యలో తీవ్ర ఆరోపణలకు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి అరెస్టు కాకుండా తన అన్న జగన్ రక్షిస్తున్నారని మీడియా మీట్ లో కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించిన సునీత హత్యలు చేసే వైసీపీకి ఓటు వేయవద్దని పిలుపు కూడా ఇచ్చారు. ఇప్పుడు కడప లోక్ సభ నుంచి వైఎస్ షర్మిల, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ సౌభాగ్యమ్మ కాంగ్రెస్ అభ్యర్థులకుగా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో జగన్ కు సొంత జిల్లాలో సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా మారినట్లైంది. దీంతో ఈ సారి జగన్ కు ఫ్యామిలీ స్ట్రోక్ గట్టిగా తగలడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.