ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మే13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక్క కుప్పం నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి ఈ జిల్లాలో సీన్ రివర్స్ అయ్యింది. జగన్ పాలనపై ప్రజాగ్రహం నిప్పులు చెరుగుతున్న పరిస్థితి. అన్నిటికీ మించి చిత్తూరు జిల్లాలో జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించడం, తెలుగుదేశం క్యాడర్, మద్దతు దారులపై దాష్టీకాలు, అదే సమయంలో అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో జిల్లాలో వైసీపీపై వ్యతిరేకత మరో రేంజ్ లో ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ హయాంలో చెప్పుకొదగ్గ ఒక్క అభివృద్ధి కార్యక్రమంకూడా జరగలేదు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు పెచ్చురెల్లిపోయాయన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ఎన్నికల తేదీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటీవల వెలువడిన పలు సర్వేలు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ ఖాయం అని పేర్కొన్నాయి. జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఇలా ఉంది.
సత్యవేడు నియోజకవర్గం
సత్యవేడు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం పోటీచేసి విజయం సాధించారు. అయతే, సీఎం జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన, వేధింపు రాజకీయాలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి అడుగంటిన తీరు కారణంగా ఆయన ఇప్పటికే వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. రానున్న ఎన్నికలలో కోనేటి ఆదిమూలం తెలుగుదేశం అభ్యర్థిగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ బరిలో దిగుతున్నారు. ఆయన ప్రత్యర్థిగా అంటే వైసీపీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ ప్రజావ్యతిరేక పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దీనికితోడు నియోజకవర్గంలోని వైసీపీలోవర్గ విబేధాలు తార స్థాయికి చేరాయి. తెలుగుదేశం అభ్యర్థి కోనేటి ఆదిమూలం విజయం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేశాయి.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కె. నారాయణ స్వామి విజయం సాధించారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే, గత ఐదేళ్లలో ఆయన పని తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతల నుంచి కూడా నారాయణ స్వామిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనికితోడు జగన్ నిర్వహించిన సర్వేల్లో నారాయణ స్వామికి టికెట్ ఇస్తే ఓడిపోతారని తేలడంతో ఆయన్ను తప్పించి ఆయన పెద్ద కుమార్తె కృపా లక్ష్మీకి జగన్ టికెట్ కేటాయించారు. కృపా లక్ష్మీకి టికెట్ ఇవ్వడం పట్ల నియోజకవర్గంలోని పార్టీ నేతల్లో కొందరు వైసీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి డాక్టర్ వి. ఎమ్ . థామస్ బరిలోకి దిగుతున్నారు. వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేతకుతోడు, నారాయణ స్వామి కుటుంబంపై వ్యతిరేకత టీడీపీ అభ్యర్థి విజయానికి దోహదపడుతుందని ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పూతలపట్టు నియోజకవర్గం
పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం ఇప్పటి వరకు విజయం సాధించలేదు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎంఎస్ బాబు విజయం సాధించాడు. అయితే, ఐదేళ్ల కాలంలో నియోజకవర్గ ప్రజల్లో ఎంఎస్ బాబుపై వ్యతిరేకత రావడంతో ఆయన్ను తప్పించిన జగన్మోహన్ రెడ్డి.. డాక్టర్ సునీల్ కుమార్ కు టికెట్ కేటాయించారు. టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ కలికిరి మురళి మోహన్ బరిలోకి దిగుతున్నారు. వైసీపీలో వర్గ విబేధాలతోపాటు, వైసీపీ ఐదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అదే సమయంలో జనసేన, బీజేపీలు టీడీపీతో కలిసి నడుస్తుండటంతో ఈ నియోజకవర్గంలో ఈసారి పూతలపట్టులో తెలుగుదేశం విజయం సానాయాసమేనని పార్టీ క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తున్నది.
నగరి నియోజకవర్గం
నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా మరోసారి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. గత ఎన్నికల్లో రోజాపై ఓటమిపాలైన తెలుగుదేశం అభ్యర్థి గాలి భానుప్రకాశ్ ఈ సారి కూడా రోజాకు ప్రత్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీలో వైసీపీ ఖచ్చితంగా ఓడిపోయే సీట్లలో నగరి ఒకటి అని పరిశీలకులే కాదు, నియోజకవర్గ ప్రజలు కూడా గట్టిగా చెబుతున్నారు. నగరి ఎమ్మెల్యేగా గత పదేళ్ల కాలంలో రోజా నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేయడమే కాకుండా, ఆమె, ఆమె కుటుంబ సభ్యుల అవినీతి తారస్థాయికి చేరడంతో ఆమెపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. దీనికి తోడు నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల వైసీపీ నేతలు రోజాకు ఈసారి టికెట్ ఇవ్వద్దని వైసీపీ అధిష్టానానికి విన్నవించుకున్నారు. అయినా జగన్ రోజాకు టికెట్ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల నుంచి , సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, అదే విధంగా సొంత జిల్లాలోనే వైసీపీలోని ఒక బలమైన వర్గం రోజాకు వ్యతిరేకంగా పని చేయడం కారణంగా ఆమె విజయం కష్టమేనని పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం అభ్యర్థి గాలి భానుప్రకాశ్ విజయం నల్లేరు మీద బండి నడకేనని అంటున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం
శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధు సూదన్ రెడ్డి విజయం సాధించాడు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఐదుసార్లు విజయం సాధించాడు. గత ఎన్నికల్లో ఆయన కుమారుడు బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి తెలుగుదేశంఅభ్యర్థిగా బరిలోకి దిగి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆ నియోజకవర్గంలో మధు సూదన్ రెడ్డి, సుధీర్ రెడ్డిలే తలపడుతున్నారు. ఈసారి వెంకట సుధీర్ రెడ్డి విజయం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి.
చిత్తూరు నియోజకవర్గం
చిత్తూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్, వైసీపీ అభ్యర్థిగా ఎం. విజయానందరెడ్డి బరిలోకి దిగుతున్నాడు. విజయానంద్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనాన్ని కొల్లగొట్టి కోట్లు సంపాదిస్తున్నారన్న విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్ల వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికితోడు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా పోటీచేస్తుండటంతో టీడీపీ అభ్యర్థి విజయం ఖాయమని పరిశీలకులు పేర్కొంటున్నారు.
చంద్రగిరి నియోజకవర్గం
చంద్రగిరి నియోజకవర్గం నుంచి గత రెండు దపాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. ఈసారి ఆయన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం పంపించింది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు తెలుగుదేశం అభ్యర్థిగా పులివర్తి వెంకటమణిప్రసాద్ (నాని) పోటీ చేస్తున్నాడు. ఈ నియోజకవర్గ ప్రజల్లో వైసీపీ ఐదేళ్ల ప్రజావ్యతిరేక పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు మూడు పార్టీలు కూటమిగా పోటీచేస్తుండటంతో నియోజకవర్గంలోతెలుగుదేశం విజయం ఖాయమని పరిశీలకులు పేర్కొంటున్నారు.
పలమనేరు నియోజకవర్గం
2019 ఎన్నికలలో పలమనేరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి నల్లప్పగారి వెంకటేగౌడ్ తెలుగుదేశం అభ్యర్థి ఎన్. అమర్నాథ్ రెడ్డిపై విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లోనూ వీరిద్దరే ప్రత్యర్థులుగా తమతమ పార్టీల తరపున పోటీ చేస్తున్నారు. అయితే, ఈసారి తెలుగుదేశం అభ్యర్థి విజయానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
కుప్పం నియోజకవర్గం
కుప్పం నియోజకవర్గంలో మరోసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా కేజే భరత్ పోటీచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చంద్రబాబు విజయం నల్లేరు మీద బండి నడక అని చెప్పొచ్చు.
పుంగనూరు నియోజకవర్గం
పుంగనూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత మూడు దఫాలుగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారు. అయితే ఈ సారి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న చల్లా రామచంద్రారెడ్డి నుంచి పెద్దిరెడ్డి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. గత ఐదేళ్ల కాలంలో పెద్దిరెడ్డి కక్షపూరిత రాజకీయాలపై నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అంతే కాకుండా తీవ్రమైన అవినీతి అక్రమాల ఆరోపణఎదుర్కొంటున్న ఆయనకు నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. నియోజకవర్గం ప్రజల్లో పెద్దిరెడ్డిపై వ్యతిరేకతకుతోడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తుండటం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కలిసి వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పీలేరు నియోజకవర్గం
ఈ నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతల రాంమచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిపై విజయం సాధించాడు. 2024 ఎన్నికల్లోనూ వీరిద్దరే తమ తమ పార్టీల అభ్యర్థులుగా రంగంలోకి దిగి పరస్పరం తలపడనున్నారు. గత ఐదేళ్లలో రాంచంద్రారెడ్డి తీరు ఆయనపై తీవ్ర ప్రజా వ్యతిరేకతను ప్రోది చేసింది. వైసీపీలో వర్గ విబేధాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా చాపకింద నీరులా పని చేస్తున్నాయి. దీంతో ఈ సారి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి విజయం సునాయాసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మదనపల్లె నియోజకవర్గం
2019 ఎన్నికల్లో మదనపల్లె నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి షాజహాన్ బాషా విజయం సాధించారు. గతేడాది ఆయన వైసీపీని వీడి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తెలుగుదేశం గూటికి చేరారు. ఈ సారి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీకి ఉన్న ప్రతికూలత, తెలుగుదేశం పార్టీకి ఉన్న సానుకూలత షాజహాన్ విజయాన్ని ఖరారు చేసేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గం
2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి విజయం సాధించారు. మరోసారి ఆయనే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా తెలుగుదేశం తరఫున జయచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. జగన్ ప్రజావ్యతిరేక పాలనకు తోడు స్వయంగా ద్వారకానథ్ రెడ్డి వ్యవహారశైలి కూడా తంబళ్లపల్లెలో జయచంద్రారెడ్డికి సానుకూలత ఏర్పడటానికి కారణమైంది. అలాగే ద్వాకానాథ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈదఫా జయచంద్రారెడ్డికి నియోజకవర్గంలో విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుగుదేశం వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
తిరుపతి నియోజకవర్గం
తిరుపతి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించాడు. ఈసారి ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కూటమి నుంచి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. అయితే, వైసీపీ ఐదేళ్ల కక్షపూరిత రాజకీయాలు, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతినే విధంగా టీటీడీ చైర్మన్ గా భూమన తీసుకున్న నిర్ణయాలు కూడా వైసీపీ పట్ల, ఆ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పట్ల ప్రజాగ్రహం వ్యక్తం అవుతోంది. దీనికితోడు నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య అంతర్గత విబేధాలు కూటమి అభ్యర్థి విజయానికి దోహదం చేస్తాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.