Saturday, October 26, 2024

వైఎస్ జగన్ కు చెక్.. కడప పార్లమెంటు నుంచి షర్మిల పోటీ? 

posted on Mar 18, 2024 1:27PM

లోక్ సభ ఎన్నికల బరిలో ఏపీ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ , గారాల పట్టి షర్మిల గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.  ఆమె స్థాపించిన వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న కారణంతో పోటీ నుంచి విరమించుకున్నట్లు షర్మిల చెప్పుకున్నారు. తాను స్థాపించిన పార్టీ పేరులో తండ్రి పేరు వచ్చే విధంగా జాగ్రత్త పడింది. తన అన్న వైఎస్ జగన్ స్థాపించిన పార్టీ పేరులో కూడా తండ్రి పేరు వచ్చే విధంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. గత ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్  సక్సెస్ అయ్యారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడని స్వయాన సోదరి షర్మిల ఆరోపిస్తున్నారు.

వైఎస్ఆర్ ఆశయాలు, ఆదర్శాలను వైఎస్ జగన్ గాలికొదిలేశారని ఆమె బాహాటంగానే ఆరోపిస్తున్నారు. తెలంగాణలో తాను స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున ఆమె పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆమె వెనకడుగు వేసారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. బిఆర్ ఎస్ ను గద్దెదించడానికి షర్మిల ఆపన్న హస్తం అందించారు. తెలంగాణ ఫలితాల ద్వారా  కెసీఆర్ ప్రభుత్వం గద్దెదిగింది. తెలంగాణ ఫలితాల తర్వాత వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల  కాంగ్రెస్ లో విలీనం చేశారు. . ప్రస్తుతం ఆమె ఎపిసిసి అధ్యక్ష పదవిలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కలియతిరుగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన చిరకాలస్వప్నాని నెరవేర్చుకోవడానికి ఆమె  కడప  పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన వైఎస్  రాజశేఖరరెడ్డి మొత్తం ఆరు సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, నాలుగు సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల  వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రిపదవి పొందారు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించారు. తండ్రి  ప్రాతినిద్యం వహించిన కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని షర్మిల  కూడా అభిలషిస్తున్నారు.  పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నిలబడనున్నారు.

ఖ్యమంత్రి జగన్ ను ఇరకాటంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఈ ఆలోచన చేసినట్లు సమాచారం. ఏఐసీసీ వర్గాలు ఈమేరకు షర్మిలపై ఒత్తిడి తెచ్చాయని తెలుస్తోంది. జగన్ ను ఆయన సొంత ఇలాఖాలోనే దెబ్బ కొట్టాలని, అందుకు షర్మిలను పోటీలో నిలబెట్టడమే మార్గమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారట. ఏఐసీసీ నేతల ఒత్తిడి నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు షర్మిల అంగీకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.మంగళవారం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ మీటింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ మీటింగ్ తర్వాత ఏపీ, తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో నిలిచే పార్టీ అభ్యర్థుల పేర్లపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 25న లోక్ సభ అభ్యర్థుల జాబితాను ఏపీసీసీ విడుదల చేయనుందని, అందులో తొలి పేరు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలదేనని చెప్పాయి. కాగా, కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు అవినాశ్ రెడ్డిపై వ్యతిరేకత పెంచి ఓటర్లు కాంగ్రెస్ ను ఆదరిస్తారని హైకమాండ్ భావిస్తోందని సమాచారం. మరోవైపు, వైఎస్ షర్మిల వైజాగ్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా ఆమె కడప ఎన్నికల బరిలో నిలుస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై కాంగ్రెస్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana