Home తెలంగాణ ఫ్యామిలీ ప్యాకేజీలతో నిండిపోయిన వైసీపీ అభ్యర్థుల జాబితా! | ycp candidates list full of...

ఫ్యామిలీ ప్యాకేజీలతో నిండిపోయిన వైసీపీ అభ్యర్థుల జాబితా! | ycp candidates list full of family| packages| botsa| peddireddy

0

posted on Mar 18, 2024 9:41AM

వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్న లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఏపీ సీఎం జగన్  ప్రకటించేశారు. ఒకే సారి 175 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేసిన జగన్, లోక్ సభ స్థానాల విషయంలో మాత్రం ఒక్క అనకాపల్లి నియోజకవర్గాన్ని మినహాయించి మిగిలిన 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. మూడు నెలల ముందునుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన జగన్.. సిట్టింగుల మార్పు అంటే తెగ హడావుడి చేశారు. ఆ తరువాత ఎట్టకేలకు ఇడుపులపాయ వేదికగా వైసీపీ తరఫున వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. ఇంత హడావుడి చేసిన తరువాత ఆయన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలను చూస్తే.. జగన్ ఎంత ఒత్తిడిలో ఉన్నారో, రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులు జగన్ ను ఏ స్థాయిలో కంట్రోల్ చేస్తున్నారో ఇట్టే అవగతమైపోతుంది. అంతే కాకుండా కొన్ని కుటుంబాలను కాదని జగన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారనీ తేటతెల్లమైపోయిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

ముఖ్యంగా జగన్ అభ్యర్థుల ప్రకటన చాలా వరకూ ఫ్యామిలీ ప్యాకేజీని తలపిస్తోందని అంటున్నారు.  ముఖ్యంగా పలువురు పార్టీ సినియర్ల కుటుంబాలు అత్యధిక స్థానాలలో పోటీ చేసేందుకు టికెట్లు సాధించుకున్నారు.  బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలనాగిరెడ్డి కుటుంబాలకు మూడేసి  టికెట్లు లభించాయి. అలాగే  ఆదిమూలపు, ధర్మాన, చెవిరెడ్డి కుటుంబాలకు రెండేసి టికెట్లు లభించాయి.  ఇది ఆయా కుటుంబాలు జగన్ పై ఎంత ప్రభావం చూపుతున్నాయో, ఆయా నాయకులపై జగన్ ఎంతగా ఆధారపడ్డారో తెలియజేస్తున్నాయి.

మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా చీపురుపల్లి నుంచి మరో సారి రంగంలోకి దిగుతున్నారు. ఆయన సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక బొత్స సమీప బంధువు బొత్స అప్పల నరసయ్య గజపతి నగరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో సారి పోటీ చేస్తుండగా, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి  రాజంపేట ఎంపీగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబల్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.   ఇక బాలనాగి రెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యేగా మరో సారి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిరెడ్డి గుంతకల్లు, మరో సోదరుడు సాయిప్రసాద్ రెడ్డి అదోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు. ఇక శ్రీకాకుళం ఎమ్మెల్యే, మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో సారి పోటీ చేయనున్నారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ కు కూడా నరసన్నపేన నుంచి వైసీపీ టికెట్ దక్కింది. అదే విధంగా కొండెపి ఎమ్మెల్యే మంత్రి ఆదిమూలపు సురేష్ మరో సారి అదే నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.

ఆయన సోదరుడు ఆదిమూలపు సతీష్ కు జగన్ కొడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇచ్చారు. అదే విధంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒంగోలు లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు, ఆయన కుమారుడు  చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఇంకా తనుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మరో సారి అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ కూ టికెట్ లభించింది. అలాగే మేకపాటి విక్రం రెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలకు జగన్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు టికెట్లు ఇచ్చారు. మొత్తంగా వైసీపీ అభ్యర్థుల జాబితాలలో ఫ్యామిలీ ప్యాకేజీలకే జగన్ పెద్ద పీట వేశారు.  

Exit mobile version