posted on Mar 16, 2024 12:49PM
లోక సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకమునుపే భారతీయ జనతా పార్టీ ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ప్రచారగీతాన్ని విడుదల చేయకపోవడం గమనార్హం
లోక్ సభ ఎన్నికలకు మరికాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే బీజేపీ తన ప్రచారాస్త్రాన్ని బయటకు తీసింది. ఎన్నికల ప్రచార గీతాన్ని శనివారం ఉదయం విడుదల చేసింది. ప్రతిపక్ష నేతల విమర్శలనే ఆయుధంగా చేసుకుని సాగే ఈ పాటలో అన్ని రాష్ట్రాల ప్రజలను చూపించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సింబాలిక్ గా చూపిస్తూ.. మేమంతా మోదీ కుటుంబమే అంటూ వారు పాడడం వీడియోలో కనిపిస్తుంది. ఇటీవల ఇండియా కూటమి బీహార్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. మోదీకి కుటుంబమే లేదు, ఇక కుటుంబ సమస్యలు ఏం తెలుస్తాయంటూ విమర్శించారు.
దీనిపై మోదీ ఘాటుగా స్పందిస్తూ.. దేశంలోని 150 కోట్ల మంది జనం తన కుటుంబమేనని చెప్పారు. ఈ విమర్శను అనుకూలంగా మార్చుకున్న బీజేపీ.. ‘మోదీ కా పరివార్’ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు అంతా తమ సోషల్ మీడియా ఖాతాలలో మే మోదీ కా పరివార్ అంటూ డీపీలు పెట్టుకున్నారు. తాజాగా ఇదే విమర్శను బీజేపీ తన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు తామంతా మోదీ కుటుంబమేనని చెబుతున్నట్లు ప్రచార గీతాన్ని సిద్ధం చేసి విడుదల చేసింది.