posted on Mar 16, 2024 11:17AM
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు తెలంగాణ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత అరెస్టు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం (మార్చి 16) మధ్యాహ్నం 3గంటలకు ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమరంలోకి ఇప్పటికే దూకేశాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులనుసైతం ప్రకటించాయి. తెలంగాణ సమాజం మొత్తం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఎనిమిది మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14పేజీల మెమో ఇచ్చారు. ఈడీ అధికారులు అరెస్టుచేసి తీసుకెళ్తున్న సమయంలో కవిత బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ, ఉత్సాహంగా కనిపించారు. అయితే, ఎన్నికల వేళ కవిత అరెస్టు ఏ పార్టీకి లాభం మేలుచేస్తుందన్న ప్రశ్న తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో కవిత అరెస్టు సంచలనంగా మారింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఆమె అరెస్టు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 2022 ఫిబ్రవరి 21న కవితకు నోటీసులు ఇవ్వగా.. అదే నెల 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ నోటీసులు ఇచ్చిన నాలుగు వారాలకు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా పలు దఫాలుగా కవితను అధికారులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. అయితే, గతంలోనే కవితను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. తెలంగాణలోని బీజేపీ నేతలు సైతం కవిత అరెస్టు ఖాయమని గత ఎన్నికల ముందు విస్తృత ప్రచారం చేశారు. కానీ, కవిత అరెస్టు జరగలేదు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎన్నికలకు ముందు కవిత అరెస్టు ఖాయమని బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి నేతలు పదేపదే ప్రస్తావించారు. కానీ, కవిత అరెస్టు కాకపోవటంతో బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లి బీజేపీ నష్టపోయింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతం అయింది. కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మడానికి ప్రధాన కారణం ఉంది. బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్టు ఖాయమని పదేపదే చెప్పారు. కానీ, ఎన్నికల నాటికి కవిత అరెస్టు కాకపోవటంతో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు సిఫ్ట్ అయిందని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను అరెస్టు చేసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీవైపు మళ్లీ ఆ పార్టీ లబ్ధి పొంది ఉండేదని రాజకీయ పరిశీలకులు ఫలితాల అనంతరం విశ్లేషించారు. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీకి అత్యధిక పార్లమెంట్ స్థానాలను కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ పలు సర్వేలు పేర్కొన్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూకడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కవిత అరెస్టును తెరపైకి తెచ్చాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కవిత అరెస్టు కూడా బీజేపీ, బీఆర్ఎస్ లు ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో భాగమని విమర్శిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు లిక్కర్ స్కాంలో కవితను ఈడీ అధికారులు అరెస్టు చేస్తారని, ఫలితంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల్లో లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఆయన ఆరోపించినట్లుగానే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటనకు ముందురోజు కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసింది. కవిత అరెస్టు ద్వారా.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ లబ్ధిపొందాలని చూస్తోందని అంటున్నారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం కవిత అరెస్టుతో.. గతంలో కాంగ్రెస్‌వైపు వెళ్లిన బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకు ప్రస్తుతం బీజేపీవైపు మళ్లుతుందన్నది కమలనాథుల భావనగా చెబుతున్నారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ ను దెబ్బకొట్టి బీఆర్ఎస్ కు సానుభూతి వెల్లువెత్తే అవకాశం ఇచ్చేందుకు కూడా కవిత అరెస్టు అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించిందనీ అంటున్నారు. కవిత అరెస్టు అయిన కొద్దిసేపటికే ఆ పార్టీనేత హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రతీ నియోజకవర్గంలో కవిత అరెస్టుకు నిరసనగా ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో లోక్‌సభ ఎన్నికల వేళ సానుభూతి పొందడం ద్వారా మెజార్టీ నియోజకవర్గాల్లో విజయం సాధించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నది. ఇలా కాంగ్రెస్ ను దెబ్బకొట్టడం కోసం ఇరు పార్టీలూ అంటే బీజేపీ, బీఆర్ఎస్ లు కవిత అరెస్టు అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. మరి బీఆర్ ఎస్, బీజేపీ వ్యూహానికి కాంగ్రెస్ ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాల్సిందే.