posted on Mar 16, 2024 1:25PM
బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ముఖ్యంగా కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడు ఏదీ కలిసి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత వారి బలహీనతలే కాదు, తప్పిదాలూ జనంలో బాగా ఎక్స్ పోజ్ అయిపోయాయి. అధికారంలో ఉండగా వెటకారం పాళ్లు ఎక్కువగా కలిపి వారు మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు వారికే బూమరాంగ్ అవుతూ జనంలో వారిని నవ్వుల పాలు చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రగతిలోని ప్రతి అడుగులోనూ తన ముద్ర వేసిన చంద్రబాబును జగన్ సర్కార్ స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో సహజంగానే హైదరాబాద్ ప్రగతికి చంద్రబాబు వేసిన బాటల వల్ల లబ్ధి పొందిన లక్షలాది మంది ఆవేదనతో ఆగ్రహంతో బయటకు వచ్చి ఆందోళన బాట పట్టారు.
అయితే రాజకీయ కారణాలతో నో, లేక చంద్రబాబు అభివృద్ధి ముద్రలను చెరిపివేసి తన పేరు లిఖించుకోవాలన్న తాపత్రేయం లేదా దురాశతోనో నాడు ఆ ఆందోళనలను అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఎగతాళి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగితే హైదరాబాద్ లో ఆందోళనలేంటని చిరాకు పడ్డారు. కావాలంటే ఏపీ వెళ్లి ఆందోళనలు చేసుకోండి, ఇక్కడ మాత్రం అంగీకరించం అంటూ రుసరుసలాడారు. సరే అప్పట్లో కేసీఆర్ అతికి ఆ ఎన్నికలలోనే ప్రజలు తమ ఆగ్రహశక్తి ఎంతటిదో చూపించారు. అది వేరే సంగతి. కానీ నాడు ఆయన అహంకారంతోనో, అతిశయంతోనే చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే గట్టిగా.. ఇంకా చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయ్యే విధంగా తగిలాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన సొంత సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. కవితను ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిపైనే ఇప్పుడు కాంగ్రెస్ సెటైర్లు గుప్పిస్తోంది. నెటిజన్లు ఓ రేంజ్ లో కేటీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి తెలంగాణతో సంబంధం ఏమిటి? ఆమె అరెస్టుకు వ్యతిరేకంగా కావాలంటే ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేసుకోండి, తెలంగాణలో మాత్రం వద్దు అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబును ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ఉటంకించారు.
ఇక నెటిజనులు కూడా ఓ రేంజ్ లో కేటీఆర్ ను తమ కామెంట్లతో ఓ ఆటాడుకుంటున్నారు. కవిత అరెస్టును నిరసిస్తు ఆయన ఈడీ ఆధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో క్లిప్పింగ్ ను వైరల్ చేస్తూ.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేసినప్పుడూ, ధర్నాలూ, ఆందోళనలను అణచివేసినప్పుడూ మీకు కోర్టులు గుర్తురాలేదా సార్!.. అంటూ ఫన్నీ ఎమోజీలతో అంతర్జాలాన్ని షేక్ చేసేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగిన ఐటీ ఉద్యోగులపై ప్రదర్శించిన జులుంను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు.