posted on Mar 16, 2024 10:34AM
పిఠాపురం నుంచి తెలుగుదేశం టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆ తరువాత చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా పార్టీ శ్రేణులలోనే కాదు, సామాన్య ప్రజానీకంగా కూడా కనీస సానుభూతికి నోచుకోక ఒంటరిగా మిగిలిపోయారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ ఇలా ప్రకటించారో లేదో.. వర్మ అలా తెలుగుదేశం అధిష్ఠానంపై తిరుగుబాటు ప్రకటించారు. ఆయన అనుచరులు నానా హంగామా చేశారు. పార్టీ జెండాలు దగ్ధం చేశారు. జనసేన అధినేతపైనా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై అనుచిత విమర్శలకు తెగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. దీంతో అప్పటి వరకూ వర్మ మీద ఉన్న అంతో ఇంతో సానుభూతి కానరాకుండా పోయింది.
టికెట్ దక్కలేదన్న ఆగ్రహంతో ఆయన, ఆయన అనుచరులు సృష్టించిన విధ్వంసంపై స్థానికులలోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వెంటనే.. వర్మపై పాపం ఇంత కాలం పార్టీ కోసం కష్టపడినా పోత్తులో భాగంగా టికెట్ దక్కకుండా పోయిందే అన్న సానుభూతి వ్యక్తమైంది. అయితే వర్మ ఆయన అనుచరులు నియోజకవర్గంలో సృష్టించిన విధ్వంసం, పవన్ కల్యాణ్, చంద్రబాబులను ఉద్దేశించి ప్రయోగించిన అనుచిత భాషతో ఆ సానుభూతి ఒక్కసారిగా ఆవిరైపోయింది. దీంతో ఆయన అంత కాలం నియోజకవర్గంలో కష్టించి సంపాదించుకున్న సానుకూతల, సదభిప్రాయం ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.
ఇప్పుడు పార్టీ శ్రేణులే కాదు, ఆయన వెంట నడిచేందుకు అనుచరులు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఒక వేళ ఇండిపెండెంట్ గా పిఠాపురం నుంచి పోటీకి దిగినా ఆయన తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లుకానీ, కాపుల ఓట్లు కానీ పడే అవకాశం ఇసుమంతైనా లేవంటున్నారు. అయితే గియితే ఆయనకు వైసీపీ సానుభూతి పరుల ఓట్లు పడే అవకాశం మాత్రమే మిగిలిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పిఠాపురం నుంచి జనసేనాని పోటీ చేయనున్నారన్న ప్రకటన వెలువడిన వెంటనే చంద్రబాబు వర్మకు ఫోన్ చేసి తనను కలవాల్సిందిగా కోరారు. అయితే అందుకు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇలా ఉండగా ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ తహతహలాడుతోంది. వర్మను పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానాలు పంపుతోంది. మొత్తం మీద వర్మ చేజేతులా నియోజకవర్గంలో తన పట్ల ప్రజలలో ఉన్న సదభిప్రాయాన్ని పోగొట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.