ఇడ్లీ… మన దక్షిణ భారతంలో చాలా ప్రముఖమైనది. వారంలో కనీసం రెండు మూడు సార్లయినా ఇడ్లీని టిఫిన్‌గా తినే వారి సంఖ్య ఎక్కువే. కొంతమంది అయితే వారంలో ఏడు రోజులు కూడా ఇడ్లీనే బ్రేక్ ఫాస్ట్ గా తింటారు. ఆరోగ్యం బాగా లేనప్పుడు కచ్చితంగా తినాల్సిన వంటకాలలో ఇడ్లీ ఒకటిగా మారిపోయింది. ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తాం. కాబట్టి వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎన్ని తిన్నా బరువు పెరగరు. అలాగే ప్రోటీన్, ఫైబర్ అందుతుంది. ఇక పెరుగు ఇడ్లీలు తినడం వల్ల వేసవిలో వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. శరీరానికి చలువదనం అందుతుంది. బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని చల చల్లని పెరుగు ఇడ్లీలు తింటూ ఉంటే ఆ రుచే వేరు. ఇవి పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియాకు ఇడ్లీ చాలా అవసరం. ఎందుకంటే ఇడ్లీని పులియబెట్టిన పిండితో చేస్తాము, కాబట్టి దానిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. గుండెకు, కాలేయానికి ఇడ్లీ చేసే మేలు అంతా ఇంతా కాదు.