ఆంధ్రప్రదేశ్ లో మా బృందం విస్తృతంగా పర్యటిస్తూ… ‘రావాలి జగన్, కావాలి జగన్ అని మీరే కదా అన్నారు’ అని అడిగినప్పుడు… ఒక్క చాన్స్ అడిగారు ఇచ్చాం. ఆ చాన్స్ కూడా రాజశేఖర్ రెడ్డి లాంటి పరిపాలన ఇస్తాడని ఇచ్చామని చెప్తున్నారు. అంతేగానీ, ఆయన ప్రకటించిన నవరత్నాలను చూసే గెలిపించామని కాదు. కానీ, తాను 125 సార్లు బటన్ నొక్కి, రూ. 2.5 లక్షల కోట్లు నిధులు ప్రజలకు పంచానని, రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలకు ఈ నిధులు అందాయి కాబట్టి 175 అసెంబ్లీ, 25 లోక్ సభ సీట్లు రావాల్సిందేనని జగన్ లెక్కలేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా తన పథకాలకు ఇన్ని కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు కాబట్టి, అన్ని ఓట్లు వస్తాయని జగన్ అనుకోవడం అత్యాశే అవుతుంది. సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి సంఖ్య, పార్టీలకు వచ్చే ఓట్లు ఎప్పుడూ మ్యాచ్ కావని గత ఎన్నికల చరిత్రను గమనిస్తే తెలుస్తుంది.