హైదరాబాద్‌లో తొలి ‘డబుల్ డెక్కర్ కారిడార్’ – ఇవాళే శంకుస్థాపన, ప్రత్యేకతలివే
హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్-ఆదిలాబాద్ మీదుగా సాగే ఎన్‌హెచ్-44పైన జంట నగరాల్లో విపరీతమైన వాహన రద్దీతో నగర ప్రజలు, ప్రయాణికులు నిత్యం పలు అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో సికింద్రాబాద్‌లో రహదారి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్‌కు(Rajiv Rahadari Elevated Corridor) కంటోన్మెంట్ ప్రాంతంలోని నిబంధనలు ఆటంకంగా మారాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో రహదారుల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జనవరి అయిదో తేదీన స్వయంగా కలిసి రాజధాని నగరంలో కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారుల విస్తరణ రక్షణ శాఖ భూములు తమకు అప్పగించాలని, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన రక్షణ శాఖ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అంగీకరిస్తూ మార్చి ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.