వెయ్యేళ్లు చెక్కుచెదరలే
ఓరుగల్లు(Warangal History) నగరాన్ని కాకతీయులు పాలించిన కాలంలో ఒకటో రుద్రుడు కీ.శ.1163లో వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1,400 మీటర్ల వైశాల్యంలో, శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలందుకునే విధంగా ఈ ఆలయాన్ని రూపొందించారు. శిలలపై సప్తస్వరాలు లిఖించడంతో పాటు టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లోనే టన్నుల కొద్దీ బరువుండే శిలలతో ఆలయానికి జీవం పోశారు. డంగు సున్నం, కరక్కాయపాడి, బెల్లం, ఇటుక పొడి తదితర మిశ్రమాలతో మొత్తం వెయ్యి స్తంభాలతో వెయ్యేళ్ల వరకు చెక్కుచెదరకుండా ఆలయాన్ని నిర్మించారు. ఇదిలాఉంటే వరంగల్ నేపథ్యంలో వేయి స్తంభాల గుడిని(Thousand Pillar Temple) చూపిస్తూ వర్షం సినిమాను తెరకెక్కించగా.. అది కాస్త సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత వర్షం డబ్బింగ్ వర్షన్స్ తో పాటు 20కి పైగా వేయి స్తంభాల గుడి, అందులో ఉన్న కల్యాణ మండపాన్ని చూపిస్తూ షూటింగ్ చేసుకుని సక్సెస్ అయ్యాయి. దీంతో వేయి స్తంభాల గుడికి సినిమా యూనిట్స్ తో పాటూ టూరిస్ట్ ల రాక కూడా ఎక్కువైంది. ఇదిలాఉంటే పర్యాటకుల తాకిడికి అనుగుణంగా ఆలయాన్ని పునరుద్ధరించే పేరున 2006లో కల్యాణ మండల స్తంభాలను తొలగించారు. వాటిని రీడెవలప్ చేసి మళ్లీ కల్యాణ మండపాన్ని రూపొందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పుకొచ్చారు.