Hyderabad Crime : క్రెడిట్ కార్డు… అత్యవసర సమయంలో అక్కరకు వచ్చే విలువైన కార్డు. క్రెడిట్ కార్డు(Credit Card)తో తీసుకున్న అప్పు సమయానికి తిరిగి చెల్లిస్తే అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ టైం దాటిందంటే వడ్డీ భారం పెరిగిపోతుంది. క్రెడిట్ కార్డు అప్పులు కట్టలేక హైదరాబాద్ లో ఓ జంట తీవ్ర నిర్ణయానికి పాల్పడింది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. కీసర పీఎస్ పరిధిలోని నివాసం ఉంటున్న సురేష్ కుమార్, అతని భార్య భాగ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డు అప్పులతో పాటు బయట కూడా సురేష్ అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు పిల్లలను భాగ్య తన అమ్మ గారింటికి పంపించింది. ఈ ఘటనపై సమాచారం అందకుున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంతో పిల్లలిద్దరూ అనాథలుగా మిగిలారు.