Saturday, October 26, 2024

టాలీవుడ్ లో మహేష్ బాబుని మించిన అదృష్టవంతుడు లేడు!

ఇటీవల ‘గుంటూరు కారం’తో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు.. తన తదుపరి సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా రాజమౌళితో సినిమాలు చేసిన ఇతర టాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే.. మహేష్ చాలా అదృష్టవంతుడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్టార్ హీరోలకి సమానమైన క్రేజ్.. దర్శకుడు రాజమౌళి సొంతం. ఆయన నుంచి సినిమా వస్తుందంటే హీరో ఎవరనే దానితో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. ‘బాహుబలి’కి ముందువరకు అపజయమెరుగని దర్శకుడిగా తెలుగునాట మాత్రమే రాజమౌళికి తిరుగులేని క్రేజ్ ఉంది. అలాంటిది ‘బాహుబలి’తో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా.. ఆయన కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ‘బాహుబలి’తో ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇదే ఇప్పుడు మహేష్ పాలిట అదృష్టంగా మారనుంది.

‘బాహుబలి’కి ముందు రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే.. తెలుగు ప్రేక్షకులు మాత్రమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. అప్పటికి తెలుగు సినిమా మార్కెట్ రూ.100 కోట్ల షేర్ కూడా లేదు. అలాంటిది వంద కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా రాజమౌళి సినిమా ప్రకటన వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ సినిమాతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సంచలనాలు సృష్టించాడు రాజమౌళి. దీంతో ఆయన పేరు నేషనల్ వైడ్ గా మారుమోగిపోయింది. ‘బాహుబలి’ దెబ్బకి రాజమౌళి తదుపరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా ఊహించని విధంగా.. ప్రపంచస్థాయిలో సత్తా చాటింది. హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. దీంతో ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి సినిమా కోసం దేశం ఎదురుచూస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏకంగా ప్రపంచ ఎదురుచూస్తుంది. అలా ఏకంగా ప్రపంచం ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లో మహేష్ హీరోగా నటిస్తున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పేరు, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు గ్లోబల్ లెవెల్ లో వినిపించాయి. కానీ ఇప్పుడు మహేష్ విషయంలో మాత్రం.. ఇంకా సినిమా మొదలు కాకముందే ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు వినిపిస్తోంది. ఇక మూవీ విడుదలై, విజయం సాధిస్తే.. మహేష్ మరెవరూ అందుకోలేని స్థాయికి వెళ్తాడు అనడంలో సందేహం లేదు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana