Home ఎంటర్టైన్మెంట్ ‘లాల్ సలామ్’ మూవీ రివ్యూ

‘లాల్ సలామ్’ మూవీ రివ్యూ

0

సినిమా పేరు: లాల్ సలామ్

తారాగణం: రజినీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, వివేక్ ప్రసన్న, లివింగ్‌స్టన్, సెంథిల్, జీవిత, కె.ఎస్. రవికుమార్

సంగీతం: ఎ. ఆర్. రెహమాన్

సినిమాటోగ్రాఫర్: విష్ణు రంగస్వామి

ఎడిటర్: బి. ప్రవీణ్ భాస్కర్

కథ: విష్ణు రంగస్వామి

రచన, దర్శకత్వం: ఐశ్వర్య రజినీకాంత్

నిర్మాత: సుభాస్కరన్

బ్యానర్స్:     లైకా ప్రొడక్షన్స్

విడుదల తేదీ: ఫిబ్రవరి 9, 2024 

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్ర పోషించిన సినిమా కావడంతో పాటు, ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ చాలాకాలం తర్వాత దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ‘లాల్ సలామ్’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పట్ల ఆసక్తి చూపించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కసుమూరు అనే గ్రామంలో మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు. అలాంటి గ్రామంలో క్రికెట్ ఆట చిచ్చుపెడుతుంది. క్రికెట్ ఆటలో జరిగిన గొడవ కారణంగా.. ఇరు మతాల వారు ఒకరిపై ఒకరు భౌతికంగా దాడి చేసుకొని, కేసులంటూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే దీనంతటికీ కారణం గురు(విష్ణు విశాల్)నే అని ఊరంతా అతన్ని అసహ్యించుకుంటుంది. దానికి తోడు అతని కారణంగా అమ్మవారి జాతర ఆగిపోయి, ఆ ఊరి పెద్దకి తీవ్ర అవమానం జరుగుతుంది. మరోవైపు అదే ఊరి నుంచి ముంబైకి వెళ్ళి బడా వ్యాపారవేత్తగా ఎదిగిన మొయిదీన్ భాయ్(రజినీకాంత్) నుంచి గురుకి ప్రాణహాని ఉంటుంది. అసలు గురుకి, మొయిదీన్ భాయ్ కి మధ్య సంబంధం ఏంటి? ప్రాణాలు తీసే అంత తప్పు గురు ఏం చేశాడు? తనని అసహ్యించుకుంటున్న ఊరి ప్రజల మనసు గురు గెలుచుకోగలిగాడా? జాతరను జరిపించడం కోసం, ఊరి ప్రజలను ఏకం చేయడం కోసం అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో గురుకి అండగా నిలిచింది ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజల మధ్య మత చిచ్చు పెట్టడం మనం నిజ జీవితంలో చూస్తుంటాం. అలాగే ఈ తరహా కథాంశంతో ఇప్పటికే పలు సినిమాలు కూడా వచ్చాయి. ‘లాల్ సలామ్’ కూడా ఆ కోవలోకి చెందినదే. కొందరు తమ స్వార్థం కోసం ప్రజలను మతాలుగా విడదీస్తారనే విషయాన్ని ఇందులో చూపించారు. దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ ప్రధానంగా ఈ సినిమా ద్వారా.. “మనం పూజించే దేవుళ్ళ పేర్లు వేరు కావొచ్చు, పూజించే విధానాలు వేరు కావొచ్చు.. కానీ అందరికీ దేవుడు ఒక్కడే.. మనమందరం ఒక్కటే” అనే పాయింట్ ని  చెప్పాలనుకున్నారు. ఆమె చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. దానిని చెప్పే క్రమంలో అడుగడుగునా తడబడ్డారు.

కలిసిమెలిసి ఉన్న ఊరి ప్రజల మధ్య గొడవ ఎందుకు జరిగింది? అసలు గురు ఏం చేశాడు? అనే ప్రశ్నలతో సినిమా ఆసక్తికరంగానే ప్రారంభమైంది. కానీ ఆ ఆసక్తి అసహనంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఒకవైపు ఊరి గొడవలు, మరోవైపు గురు ప్రేమ కథ, ఇంకోపక్క మొయిదీన్ భాయ్ కథ.. ఇలా ఫస్టాఫ్ ఎటెటో వెళ్తూ, గందరగోళ కథనంతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త మెరుగ్గా ఉంది. సినిమా చివరి దశకు చేరుకునే కొద్దీ కథనంలో కాస్త పట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మెప్పించాయి.

ఒక చిన్న పాయింట్ ని పట్టుకొని, ఏదో పెద్ద ట్విస్ట్ ఉందనే భ్రమని కలిగిస్తూ.. కథనాన్ని నడిపించి, ప్రేక్షకులను మెప్పించాలనుకున్న ఐశ్వర్య వ్యూహం బెడిసికొట్టింది. కథనం ఆసక్తికరంగా ఉండకపోగా.. సాగదీతగా, గందరగోళంగా ఉంటుంది. రజినీకాంత్, పతాక సన్నివేశాలు లేకపోతే ఈ సినిమా అవుట్ పుట్ మరింత దారుణంగా ఉండేది.

కథాకథనాల మీద విష్ణు రంగస్వామి మరింత వర్క్ చేసి ఉండాల్సింది. సినిమాటోగ్రాఫర్ గా మాత్రం విష్ణు రంగస్వామి ఆకట్టుకున్నాడు. పాటల్లో రెహమాన్ మ్యాజిక్ మిస్ అయింది కానీ, నేపథ్య సంగీతంలో మాత్రం కొంతవరకు ఆయన మార్క్ కనిపించింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలను తన సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్లాడు. కథనమే నెమ్మదిగా ఉండటంతో ఎడిటర్ ప్రవీణ్ భాస్కర్ కూడా చేతులెత్తేశాడు. కొన్ని సన్నివేశాలను కాస్త ట్రిమ్ చేసినా ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

ఎలాంటి పాత్రలోనైనా తన స్క్రీన్ ప్రజెన్స్ తో మ్యాజిక్ చేయడం రజినీకాంత్ కి అలవాటు. మొయిదీన్ భాయ్ గా మరోసారి ఆయన మ్యాజిక్ చేశాడు. అయితే కొన్నేళ్లుగా రజినీకి తెలుగులో సింగర్ మను డబ్బింగ్ చెబుతున్నాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడంతో ప్రేక్షకులు దానికి అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. గురు పాత్రలో విష్ణు విశాల్ చక్కగా రాణించాడు. తనదైన నటనతో ఆ పాత్రని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. విక్రాంత్, వివేక్ ప్రసన్న, జీవిత, లివింగ్‌స్టన్, సెంథిల్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా…

“మతాలుగా విడిపోవద్దు, మనుషులుగా కలిసుందాం” అని ఐశ్వర్య రజినీకాంత్ చెప్పాలనుకున్న ప్రయత్నం మెచ్చుకోదగినదే అయినప్పటికీ.. పేలవమైన కథాకథనాల కారణంగా సినిమా మెప్పించలేకపోయింది. ఈ సినిమా ద్వారా ఆమె చెప్పాలనుకున్న సందేశం, రజినీకాంత్ నటన, పతాక సన్నివేశాల కోసం.. కాస్త ఓపిక ఉంటే ఒక్కసారి చూడవచ్చు.

రేటింగ్: 2.25/5 

-గంగసాని

Exit mobile version