పుల్లని పెరుగు తినవచ్చా?
ఒక్కొక్కసారి పెరుగు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండడం వల్ల పులిసిపోతుంది. దీన్ని తినాలా వద్దా అన్నది ఆ వ్యక్తి ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుంది. పుల్లని పెరుగు తినడం వల్ల కొన్ని సానుకూల ప్రభావాలు ఉన్నాయి. అలాగే ప్రతికూల ప్రభావాలు కూడా కనిపిస్తాయి. పుల్లని పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి పేగు ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తాయి. సాధారణ పెరుగుతో పోలిస్తే పుల్లని పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పేగుల ఆరోగ్యం కోసం పుల్లని పెరుగు తినాల్సిందే. ఎవరైతే జీర్ణ క్రియ సమస్యలతో బాధపడతారో, తరచూ జలుబు, శ్వాస కోశ సమస్యలతో సతమవుతమవుతూ ఉంటారో వారు మాత్రం పుల్లని పెరుగుకు దూరంగా ఉంటే మంచిది. పుల్లని పెరుగు ఆ సమస్యలను మరింతగా పెంచేస్తుంది. పుల్లని పెరుగు అధికంగా తినడం వల్ల శరీరంలో శ్లేష్మం కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి జలుబు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆయుర్వేదం కూడా ఈ విషయాన్ని చెబుతోంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా పుల్లని పెరుగును తక్కువగా తీసుకోవాలి. లేకపోతే పొట్ట ఉబ్బరం, అసౌకర్యంగా అనిపించడం, విరోచనాలు కావడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు పుల్లని పెరుగును తింటే మంచిది. శ్వాసకోశ సమస్యలు, జలుబు వంటివి ఉన్నవారు పుల్లని పెరుగుకు దూరంగా ఉండాలి