పరిశ్రమలలో పనిచేసే కార్మికులే లక్ష్యంగా గంజాయి సరఫరా
పరిశ్రమలలో పనిచేసే కార్మికులే లక్ష్యంగా గంజాయి, గంజాయి చాక్లెట్ లను విక్రయిస్తున్న ఓ కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి కిలోన్నర ఎండు గంజాయిని, మత్తు పదార్ధాలతో తయారుచేసిన చాక్లెట్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ శివారులో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన రాధేశ్యామ్, తన కుటుంబసభ్యులతో కలిసి కొన్ని సంవత్సరాలుగా హత్నూర మండలం మల్కాపూర్ శివారులోని వీఎస్ఆర్ గార్డెన్ సమీపంలో గల వ్యవసాయ క్షేత్రంలో నివాసముంటున్నారు. వీరి కుటుంబం చాలా కాలంగా గంజాయిని విక్రయిస్తుంది. దీంతో వీరు స్థానిక పరిశ్రమలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులనే లక్ష్యంగా చేసుకొని ఎవరికి తెలియకుండా రహస్యంగా గంజాయిని, మత్తు పదార్థాలతో తయారుచేసిన చాక్లెట్ లను విక్రయిస్తున్నారు. దీంతో పోలీసులు నమ్మదగిన సమాచారంతో రాధేశ్యామ్ అతని కుమారులు నివాసం ఉంటున్న నివాసాలలో తనిఖీలు నిర్వహించి, వారి ఇండ్లల్లో నుంచి కిలోన్నర ఎండు గంజాయిని, గంజాయి చాక్లెట్ లను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రాధేశ్యామ్ ను,గుండ్లమాచనూరు శివారు పరిశ్రమలో పనిచేస్తున్న అతని కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు జిన్నారం సీఐ తెలిపారు.